ఏదో ఉద్దేశంలో చెప్పిన మాటను.. ఇంకేదో ఉద్దేశంలో తీసుకొని.. తమ ఉద్దేశాన్ని జోడించి సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్ ముసుగులో ఉన్న నెటిజన్స్. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతూ ఇండస్ట్రీకి ఇదోక పెద్ద జబ్బుగా మారింది. లేనిపోని వ్యాఖ్యలు జోడించడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేశారు రామ్‌చరణ్ – తమన్. ఇక్కడ చరణ్ అంటే అతని ఫ్యాన్స్ అని చెప్పాలి. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి తమన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
రామ్ చరణ్ విషయంలో తానొకటి అంటే కొంతమంది మరోలా అర్థం చేసుకున్నారని తమన్ చెప్పుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పాటల విషయంలో తాను చెప్పింది వేరని.. పాటలకు హుక్ స్టెప్పులు లేవని మాత్రమే అన్నానని చెప్పాడు. అంతేకానీ రామ్‌చరణ్ డ్యాన్స్ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశాడు. హుక్ స్టెప్పే రీల్స్‌కు ఉపయోగపడుతుంది. కానీ ‘గేమ్ ఛేంజర్’లో కొరియోగ్రాఫర్లు అలాంటి మూమెంట్స్ ఇవ్వలేకపోయారని తాను అన్నానని క్లారిటీ ఇచ్చారు. అంతేకానీ చరణ్ డ్యాన్స్ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదని చెప్పాడు.
రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అని, అందుకే ఆయన్ను ‘మెగా హార్ట్ స్టార్’ అని పిలుస్తుంటానని తమన్ తెలిపారు. అలాగే ‘ఓజీ’ సినిమా మ్యూజిక్ గురించి రామ్ చరణ్ తనతో ప్రత్యేకంగా మాట్లాడాడని చెప్పుకొచ్చారు. ‘ఓజీ’ సినిమా మ్యూజిక్ ఫైర్ మోడ్‌లో ఉందని.. చేతులపై కిరోసిన్ పోసుకుని సంగీతం ఇచ్చావా’’ అని చరణ్ అడిగారని తమన్ చెప్పారు. తాము ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉన్నామని.. ఉద్దేశపూర్వంగా కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
అయితే.. ‘గేమ్ ఛేంజర్’ సమయంలో ‘గేమ్ ఛేంజర్’లో సరైన స్టెప్పులు వేయకపోవడం వల్లే పాటలు జనాల్లోకి వెళ్లలేదని తమన్ అన్నట్లు కొన్ని వీడియోలు, కామెంట్లు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి.