బాలీవుడ్ లో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్పేయి, ప్రియమణి జంటగా నటించారు. టెర్రరిస్ట్ లను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఓ అధికారి కథే ఈ సిరీస్. తొలి సీజన్ విడుదలైన ఏడాదిన్నర తరువాత రెండో సీజన్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య పాత్ర పోషించింది. దీంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు.
ఫిబ్రవరి 12న ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకుంది అమెజాన్ ప్రైమ్. కానీ ఇప్పుడు విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. వాయిదా అంటే ఒక డేట్ నుండి మరో డేట్ కి మార్చడం కాదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నారట. విడుదలపై స్పష్టత లేదని తెలుస్తోంది. ఇప్పట్లో అయితే సిరీస్ ను రిలీజ్ చేయరని సమాచారం. దానికి కారణం ఏంటంటే.. గత కొన్ని నెలల్లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసిన ‘మీర్జాపూర్ 2’, ‘తాండవ్’ సిరీస్ లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రెండు సిరీస్ లపై కోర్టులో కేసులు కూడా పెట్టారు. అనుకున్నదానికంటే ఈ కేసులు చాలా సీరియస్ గా మారాయి.
ఇప్పుడు వాటి ఎఫెక్ట్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ ను రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తోంది అమెజాన్ ప్రైమ్ సంస్థ. నిజానికి గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీజన్ 2 లో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే ప్రైమ్ సంస్థ మరిన్ని ఇబ్బందుల్లో పడడం ఖాయం. అందుకే ఈ వివాదాలన్నీ సెటిల్ అయ్యేవరకు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.