పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ రియాక్షన్ తో సాగుతున్నప్పటికీ, ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక కొత్త రకం వార్త వైరల్ అవుతోంది. వెండితెరపై ప్రభాస్ లుక్స్, కొన్ని సీన్లలో ఆయన ముఖ కవళికలు సహజంగా లేవంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ మరియు ఎమోషనల్ ఎపిసోడ్స్‌లో ‘ఫేస్ స్వాప్’ టెక్నాలజీని వాడారనే అనుమానాలు నెటిజన్లలో బలపడుతున్నాయి.
థియేటర్లలో మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసిన కొన్ని వీడియో క్లిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలలో హీరో ముఖం డిజిటల్‌గా మార్చినట్లు కనిపిస్తోందని, డూప్ షాట్స్‌ను కవర్ చేయడానికి మేకర్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఉండొచ్చని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. థియేటర్ లో ప్రొజెక్షన్ లోపాలు లేదా మొబైల్ రికార్డింగ్ వల్ల కలిగే ‘డిస్టార్షన్’ కారణంగానే అలా అనిపిస్తుండొచ్చని వారు వెనకేసుకొస్తున్నారు.
ఈ గందరగోళానికి తెరపడాలంటే సినిమా ఓటీటీలోకి రావాల్సిందేనని మెజారిటీ ప్రేక్షకులు భావిస్తున్నారు. థియేటర్లలో ఉన్న లైటింగ్, స్క్రీన్ క్వాలిటీ వల్ల కొన్ని సూక్ష్మమైన తేడాలను కనిపెట్టడం కష్టం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 4K రిజల్యూషన్‌లో చూసినప్పుడు అసలు అది ఫేస్ స్వాపా లేక సహజమైన మేకప్పా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ టెక్నికల్ లోపాలపై క్లారిటీ రాకముందే నెట్టింట జరుగుతున్న ఈ చర్చ సినిమా ఇమేజ్‌పై ప్రభావం చూపుతోంది.
నిజానికి గతంలో కూడా కొన్ని భారీ చిత్రాల విషయంలో ఇలాంటి ఏఐ లేదా డిజిటల్ టెక్నాలజీ వాడకంపై విమర్శలు వచ్చాయి. ‘రాజా సాబ్’ విషయంలో వైరల్ అవుతున్న వీడియోలు కేవలం ఫ్యాన్ ఎడిటింగ్ మాయా లేక నిజంగానే విజువల్ ఎఫెక్ట్స్ లోపాలా అనేది మేకర్స్ చెబితే తప్ప తేలదు. ప్రస్తుతం దర్శకుడు మారుతి కానీ, ఇతర టీమ్ సభ్యులు కానీ ఈ రూమర్లపై స్పందించలేదు. డిజిటల్ స్ట్రీమింగ్ తర్వాతే ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది.