సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమా హాళ్లను వసతుల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజిస్తూ.. వాటి ఆధారంగా సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే భారీ బడ్జెట్ సినిమాల టికెట్ల ధరల పెంపునకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త టికెట్ ధరల జారీ చేసిన జీవోను ఎగ్జిబిటర్లు ఖండించారు.
అంతేకాదు ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పది రోజుల గడువు ఇచ్చి ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. మరోవైపు సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునర్ సమీక్ష చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరల నిర్ణయంపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని కోరింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. టికెట్ ధరల పెంపు విషయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల అభిప్రాయాలను తీసుకోవాలని ఛాంబర్ కోరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పరిశీలించాలని, కొత్త విధానంతో టౌన్ థియేటర్లపై ప్రభావం పడుతుంది అని ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది.
ప్రభుత్వం కొత్త జీవో ప్రకారం.. నాన్ ఏసీ థియేటర్లలో.. నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 ఉంటుంది. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో.. నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150గా ఉంటుంది. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ రేట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 పెట్టగా.. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో రెగ్యులర్ టికెట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఉంచారు. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా పెట్టారు.