Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఫ్యాన్ బేస్ గురించి కానీ, ఆయన మార్కెట్ గురించి కానీ, ఆయనపై ప్రేక్షకుల్లో ఉన్న గౌరవం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 75 ఏళ్ల వయసులో హీరోగా చేయడమే గొప్ప విషయం. అలాంటిది రజినీకాంత్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్లు ఇస్తూనే ఉన్నారు. దానికి కారణం ముందుగా చెప్పుకున్న రీజన్స్ అనడంలో సందేహం లేదు. హిట్టు, ఫ్లాప్‌లతో ఆయనకు సంబంధం లేదు. రజినీ సినిమా వస్తుందంటే చాలు జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారు. ఒకవేళ సినిమా అంతగా ఆడకపోయినా.. నష్టాలు కూడా పెద్దగా రావు.

Rajinikanth

సరే.. ఆ విషయాలు పక్కనబెడితే, రజినీకాంత్‌ను చూసి మన టాలీవుడ్ సీనియర్ హీరోలు చాలా నేర్చుకోవాలనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. రజినీకాంత్ హిట్టు, ఫ్లాప్ అనే సమీకరణాల దగ్గర ఆగిపోవడం లేదు. ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. తద్వారా సినీ ఇండస్ట్రీపై ఆధారపడిన ఎంతో మందికి నిరంతరం పని కల్పిస్తున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు.

అలాగని తన స్టైల్‌కి తగ్గట్టు కథలు మార్చమని ఆయన వాళ్లను కోరడం లేదు. డైరెక్టర్ విజన్‌కి, శైలికి తగ్గట్టే తాను నటిస్తున్నారు. ‘జైలర్’, ‘జైలర్ 2’ సినిమాలనే తీసుకుందాం. అందులో మనకు గతంలో రజినీ సినిమాల్లో కనిపించిన రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించవు. ఆయన యాక్టింగ్ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. రిటైర్డ్ జైలర్‌గా హుందాగా కనిపిస్తూనే, మరోపక్క తన మనవడికి షూస్ తొడగడం, తుడవడం వంటి పనులు చేస్తుంటారు.

‘కూలీ’ సినిమాలో సైతం విలన్ (నాగార్జున) ముందు చెయ్యి కట్టుకుని నిల్చునే సన్నివేశానికి ఏమాత్రం ఇగో లేకుండా ఒదిగిపోయారు. కానీ, మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణల లెక్క వేరు. వాళ్లు కేవలం అభిమానుల కోసం కథల్లో ఫోర్స్డ్ హీరోయిజం ఇరికిస్తుంటారు. యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేస్తున్నప్పటికీ.. తమ స్టైల్‌కి తగ్గట్టే మార్పులు చేయమంటారు. ముదురు హీరోయిన్లు ఉండకూడదు. కుర్ర హీరోయిన్లే ఉండాలి, వాళ్ళ పాత్రలు కూడా వీళ్లనే లవ్ చేయాలి, డ్యూయెట్లలో వీళ్లతో కలిసి స్టెప్పులు వేయాలి.

ముఖ్యంగా సినిమాల్లో తమ వయసు (ఏజ్) టాపిక్ అనేది అస్సలు రాకూడదు. ఇలాంటి మూస పద్ధతులను రజినీకాంత్‌ను చూసి అయినా వాళ్లు మార్చుకోవాలి. ఫోర్స్డ్ హీరోయిజం, రొమాన్స్ లేకపోయినా రజినీ సినిమాలు భారీ స్థాయిలో ఆడుతున్నాయి కదా! కేవలం ఫ్యాన్స్ ఒక్కరే చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? సామాన్య ప్రేక్షకుడు కూడా ఆ కథకు కనెక్ట్ అయ్యి, దాన్ని ఓన్ చేసుకుంటేనే కదా సినిమా ఆడేది! ఈ సత్యాన్ని చిరు, బాలయ్య  తెలుసుకోవాలి.

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus