సినీ ఇండస్ట్రీలో మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. శరత్ బాబు మరణం నుండి నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కోలీవుడ్ యాక్టర్ బోస్ వెంకట్ సోదరి, ఆ తర్వాత ఆమె సోదరుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు, టాలీవుడ్ యువ దర్శకుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల తండ్రి కూడా మరణించారు. తర్వాత యూట్యూబర్ దేవరాజ్ పాటిల్, ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ గారి తల్లి టి జి గీతాంజలి,యువ నటుడు హరి కాంత్(గుండెపోటుతో ) వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.
వీటి షాక్ నుండీ ఇంకా ఇండస్ట్రీ కోలుకోక ముందే ఇప్పుడు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ పి.ఆర్.ఓ(PRO)గా ‘అదిరిందయ్యా చంద్రం’, ‘పెళ్ళి కాని ప్రసాద్’, ‘ఏం బాబూ లడ్డూ కావాలా?’ వంటి చిత్రాలకు పనిచేసిన పెదిరెడ్ల త్రినాథ్ నిన్న అంటే జులై ౩న 11.30 గంటలకు మరణించారు. ఈయన వయసు 47 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఈయన పలు సినిమాలకి నిర్మాణ బాధ్యతలు వహించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన నిన్న మరణించినట్టు స్పష్టమవుతుంది. త్రినాథ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, పాపికొండలు సమీపంలోని కొండమొదలు. తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు త్రినాథ్ షూటింగ్ కో – ఆర్డినేటర్ గా పని చేశారు.