నిర్మాతగా మారనున్న మాటల మాంత్రికుడు!

స్టార్ డైరక్టర్ గా ఎదిగిన తర్వాత చిన్న సినిమాలు చేయడానికి దర్శకులకు కుదరదు. అలా అని  నచ్చిన కథను వదిలేయలేరు. అందుకే మన టాలీవుడ్ బిగ్ డైరక్టర్లు నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సాయి కొర్రపాటితో కలిసి అందాల రాక్షసి సినిమాను నిర్మించారు. పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్, బంపర్ ఆఫర్ సినిమాలకు డబ్బులు పెట్టారు. కుమారి 21 ఎఫ్ తో సుకుమార్ నిర్మాతగా మారారు. వీరి బాటలో పయనించడానికి మాటల మాంత్రికుడు సన్నద్ధమవుతున్నారు.

తక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతిభ కలిగిన కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ వారి నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను దర్శకత్వం వహించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్, కొత్త కథలను కూడా వింటున్నట్లు తెలిసింది. పవన్ తో  సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. అదే సమయంలోనే ఆయన ప్రొడక్షన్ లో మూవీ ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ కంపెనీలో ముందుగా దర్శకురాలు నందిని రెడ్డి ఛాన్స్ కొట్టేసిందట.  అలా మొదలయ్యింది, కల్యాణ వైభోగం వంటి ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమెపై త్రివిక్రమ్ కు మంచి అభిప్రాయం ఉండడమే ఇందుకు కారణం. కుటుంబ కథతో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్రివిక్రమ్ సన్నిహితులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus