మేం మంచి సినిమా తీశాం.. మమ్మల్ని తొక్కేస్తున్నారు.. మా కష్టానికి విలువ లేకుండదా చేస్తున్నారు.. ఇలాంటి మాటలు టాలీవుడ్‌లో చాలాసార్లు వినిపిస్తాయి. అలా ఎక్కువ సార్లు అన్నవారిలో రీసెంట్ టైమ్స్‌లో సితార ఎంట్‌టైన్మెంట్స్ నాగవంశీ ఉంటారు. ఆయన నిర్మించిన సినిమా వస్తోంది అంటే.. ఇలాంటి కామెంట్లు కామన్. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చి.. వసూళ్లు వస్తే ఓకే. కాస్త అటు ఇటైనా ‘పైన చెప్పిన డైలాగ్‌లు వచ్చేస్తాయి’. గత కొన్నేళ్లుగా ఇలానే జరగుతూ వస్తోంది.
విశ్వక్‌సేన్ – అనుదీప్ ‘ఫంకీ’ సినిమా ఫలితం చూశాక.. ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ‘‘మేమేమన్నా ‘శంకరాభరణం’ సినిమా తీశామని చెప్పామా.. లేదు కదా’’ అంటూ సినిమా ఫలితం గురించి లైట్ చేస్తూ మాట్లాడారు. ఆ సినిమా గురించి ఎక్కువ మంది మాట్లాడే అవకాశం థియేటర్లు ఇవ్వలేదు. ఎంత వేగంగా క్యూబ్ కీస్ వచ్చాయో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో థియేటర్లలో సినిమా చూసి దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా సినీ గోయర్స్‌లో లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
దీంతో సినిమా గురించి మాటలు పెరిగాయి. ఈ క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘‘శంకరాభరణం’ తీయలేదు సరే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా’’ అని. ఎందుకంటే ‘ఫంకీ’ సినిమా సినిమాలా లేదు. ఎవరెవరో సినిమాలోకి వస్తుంటారు.. ఏదేదో మాట్లాడుతుంటారు. మాటలకు, చేతలకు, సినిమా ఫ్లోకు ఏ మాత్రం సంబంధం ఉండదు. హీరో – హీరోయిన్లు మధ్య సన్నివేశాలు కూడా కృతకంగానే సాగుతాయి. ఇక కథ, కథనం గురించి అస్సలు మాట్లాడుకోకూడదు.
ఈ మాటలు వినడానికి సినిమా టీమ్‌కి బాధగానే ఉంటుంది. అయితే థియేటర్లలో సినిమాను తొక్కేశారని.. ఓటీటీలోకి వచ్చాక ఏళ్లపాటు గుర్తుండిపోతుందని హీరో, టీమ్ మొన్నామధ్య గొప్పగా చెప్పింది. కానీ ఓటీటీలోకి వచ్చాక చూస్తే థియేటర్లలో వచ్చినప్పుడు జరిగిన పంచాయితీ కంటే ఎక్కువ అవుతోంది. ఈ లెక్కన అటు నాగవంశీ, ఇటు అనుదీప్, ఇంకోవైపు విశ్వక్‌సేన్ మరోసారి ఆలోచించుకోవాలి.