ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. మ్యూజికల్ కాన్సర్ట్ సందర్భంగా ఓ మహిళా అభిమాని అతనితో సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరగా రాగా, ఉదిత్ ఆమెకు ముద్దు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన అసహనం కలిగించిందని, లెజెండరీ సింగర్‌గా ఉన్నా ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు. ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ స్పందించారు.
ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వైపు వివరణ ఇచ్చారు. “నా అభిమానులపై నాకు అపారమైన ప్రేమ ఉంది. వారు నాకు ఎంత ఇష్టపడతారో, నేను కూడా వారిని అంతే ప్రేమగా చూసుకుంటాను. అలాంటి ఆత్మీయతను వ్యక్తం చేయడమే తప్ప, ఏదైనా తప్పుదారిలో ఆలోచించలేను” అని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ సంఘటనను కావాలనే పెద్ద వివాదంగా మార్చారని అన్నారు. ఉదిత్ నారాయణ్ తన అభిమానం వ్యక్తం చేసేందుకు మాత్రమే అలా చేశానని చెప్పినా, కొందరు నెటిజన్లు మాత్రం ఈ వివరణను అసలు అంగీకరించడంలేదు.
“మహిళా అభిమాని అనుకోకుండా ఈ సీన్‌లో పడిపోయింది. కానీ ఆమె అభిప్రాయం ఏంటో ఎవరూ అడగలేదు. అందుకే ఇది వివాదాస్పదం” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, “ఫ్యాన్స్ కోసం గాయకుడు చేసిన చిన్న చర్యను ఇంత పెద్దగా చేయడం అవసరమా?” అంటూ సమర్థిస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే, ఉదిత్ నారాయణ్ ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో వేలాది పాటలు ఆలపించారు.
90ల నుంచి 2000ల వరకూ ఆయన హిట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మ్యూజికల్ టూర్‌లు నిర్వహిస్తూ తన అభిమానులతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ముంబైలో జరిగిన కాన్సర్ట్‌లో ‘టిప్ టిప్ బర్ సా’ పాట పాడిన సమయంలో, అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పుడే ఈ ముద్దు ఎపిసోడ్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఉదిత్ వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందనేది ఇంకా సందేహంగా ఉంది.