Sri Rama Rajyam: 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘శ్రీరామరాజ్యం’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 17, 2022 / 06:09 PM IST

తెలుగు సినిమా పరిశ్రమలో తెరకెక్కినన్ని పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు మరే ఇతర భాషల్లోనూ రూపొందలేదు.. తరాలు మారినా మన చిత్రాలు చరిత్రలో అజరామరంగా.. అపురూపమైన దృశ్యకావ్యాలుగా మిగిలిపోయాయి.. తరాలు మారినా చెక్కుచెదరని ఆణిముత్యాలు అలనాటి పౌరాణిక సినిమాలు.. మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారడంతో పౌరాణిక చిత్రాలు తియ్యాలని కానీ, అలాంటి పాత్రలు వెయ్యాలని కానీ ఎవరూ సాహసించలేదు.. అలాంటి టైంలో వచ్చింది ‘శ్రీరామరాజ్యం’.. దిగ్దదర్శకులు బాపు, రచయిత రమణల ద్వయం 60 ఏళ్లు పైబడిన తర్వాత కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టడం ఆశ్చర్యమనే చెప్పాలి..

నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతగా.. నటసామ్రాట్ ఏఎన్నాఆర్ వాల్మీకిగా నటించగా.. శ్రీ సాయిబాబా మూవీస్ బ్యానర్ మీద యలమంచిలి సాయిబాబా నిర్మించిన అద్భుతమైన పౌరాణిక చిత్రం.. ‘శ్రీరామరాజ్యం’.. 2011 నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం 2022 నవంబర్ 17 నాటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈతరం మర్చిపోతున్న మన పురాణగాథను తెలుగు ప్రేక్షకులకు చాటిచెప్పాలని చేసిన ప్రయత్నమే ‘శ్రీరామరాజ్యం’..

రావణ వధ తర్వాత పుష్పకవిమానంలో అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడికి కులగురవైన వశిష్టుడి చేత పట్టాభిషేకం జరగడంతో ప్రారంభమైన సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. అందరికీ తెలిసిన ఉత్తర రామాయణం ఆధారంగానే తెరకెక్కించినా కానీ ఇప్పటివారికి కూడా అర్థమయ్యేలా అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు బాపు.. శ్రీరామునిగా బాలయ్య నటన అద్భుతం.. తండ్రి తారక రామారావు నట వారసుడిగానే కాదు.. ఆయన తర్వాతి తరంలో అలాంటి పాత్రలు చేయాలంటే అది తనకే సాధ్యమని నిరూపించాడు బాలయ్య..

సీతగా నయనతారను తప్ప మరొకరిని ఊహించలేం.. వాల్మీకిగా ఒదిగిపోయారు నటసామ్రాట్.. లవుడు, కుశుడు, బాలహనుమంతుడు పాత్రధారులు మెప్పించారు.. కొన్ని సన్నివేశాలు, పాత్రల విషయంలో ‘లవకుశ’ తో పోలిస్తే కొన్ని తేడాలు కనిపిస్తాయి.. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతకి ప్యాషన్‌తో పాటు ధైర్యం కూడా కావాలి.. ఆ విషయంలో నిర్మాత సాయిబాబుని అభినందించాల్సిందే..
ఇళయరాజా పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోశాయి..

‘శ్రీరామరాజ్యం’ కు ప్రేక్షకుల నీరాజనం..

ఒకే తరహా సినిమాలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకలోకానికి.. మన తెలుగు సినిమా పౌరాణికం యొక్క గొప్పదనాన్ని తెరపై చూపించిందీ చిత్రం.. ఆ తరం, ఈ తరం.. కుటుంబ సమేతంగా అందర్నీ కలిపి థియేటర్లకు తీసుకు వచ్చింది ‘శ్రీరామరాజ్యం’.. తెలుగు సినిమా అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఆదరణతో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శింపబడింది.. ఇంకో విశేషం ఏంటంటే.. 100 రోజులు ఆడిన చివరి పౌరాణిక చిత్రంగా ‘శ్రీరామరాజ్యం’ చరిత్రలో నిలిచిపోయింది..

సీతగా నయనతారే కావాలంటు పట్టుబట్టిన బాలయ్య..

అంతకుముందు తొలిసారిగా ‘సింహా’ చిత్రంలో బాలయ్య, నయనతార కలిసి నటించారు. ఆమె క్యారెక్టర్, గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే వీరి జంటకు కూడా మంచి పేరు వచ్చింది.. దీంతో బాలయ్య.. సీత పాత్రకి నయనతార అయితే సరిగ్గా సరిపోతుంది.. తను సీతగా చేయకపోతే సినిమా ఆపేద్దాం అనడంతో.. దర్శక నిర్మాతలు నయనతారకు విషయం చెప్పారు..

నయనతార చివరి సినిమా..

అప్పటికే ప్రభుదేవాతో రిలేషన్‌లో ఉన్న టాప్ స్టార్ హీరోయిన్ అతనితో పెళ్లికి రెడీ అవుతూ.. అప్పటికే కొన్ని అవకాశాలను వదులుకుంది.. ‘శ్రీరామరాజ్యం’ దర్శక నిర్మాతలకు కూడా నో చెప్పింది.. వారు బాలయ్య.. సీతగా మీరు చేయనంటే సినిమా ఆపేద్దామన్నారని చెప్పగా.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. షూటింగ్ చివరి రోజు.. ఇదే చివరి సినిమా.. ఇక నటించలేను అని తలుచుకుని.. బాపు గారి కాళ్లకు నమస్కారం చేసి.. కంటతడి పెట్టిందామె.. యూనిట్ సభ్యులంతా ఘనంగా వీడ్కోలు పలికారు..

అవార్డులు..

ప్రేక్షకుల ప్రశంసలు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో పాటు పలు అవార్డులు వరించాయి.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ మేకప్ కళాకారుడు, ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి.. ఈ ఏడు కేటగిరీల్లో.. ఏడు నంది అవార్డులు వచ్చాయి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలతో రూపొందిన బాపు, రమణల అపురూప దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’ ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరుగని ముద్ర వేసింది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus