వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

“అజ్ణాతవాసి” లాంటి డిజాస్టర్ & మూడేళ్ళ విరామం అనంతరం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “వకీల్ సాబ్”. హిందీలో ఘన విజయం సాధించిన “పింక్” చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో కాసిన్ని ఎక్కువ మార్పులు చేసినప్పటికీ.. విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అన్నిటికీ మించి పవన్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడంతో భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే సినిమాకి భారీ ఓపెనింగ్స్ & బుకింగ్స్ కూడా వచ్చాయి. మరి ఇన్ని భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న “వకీల్ సాబ్” అంచనాలను అందుకోగలిగిందా? ఒరిజినల్ “పింక్” ఆత్మను ఖూనీ చేయకుండా మంచి పాయింట్ ను మరింత మంది ఆడియన్స్ కి కమర్షియల్ గా చేరువ చేయగలిగిందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను పూర్తిస్థాయిలో సంతుష్టులను చేయగలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానం సమీక్షలో తెలుసుకొందాం..!!

కథ: హ్యూమన్ రైట్స్ లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) కోర్టు దిక్కారం కారణంగా నాలుగేళ్ళు బార్ కౌన్సిల్ నుండి రద్దు చేయబడిన వకీల్ సాబ్. వేముల పల్లవి (నివేదా థామస్), జరీనా బేగమ్ (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ళ) అనుకోని విధంగా ఓ అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. నిజానికి తప్పు వాళ్ళది కాకపోయినా అవతలి వాళ్ళకి పోలిటికల్ సపోర్ట్ ఉండడంతో ముగ్గురు అబలలు నానా ఇబ్బందులుపడుతుంటారు. ఈ నేపధ్యంలో అమ్మాయిల పక్షాన నిలబడ్డ వకీల్ సత్యదేవ్ వారి తరపున వాదించి వారికి న్యాయం చేయగలిగాడా? లేదా? అనేది “వకీల్ సాబ్” కథాంశం.

నటీనటుల పనితీరు: పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటాడు. ఈ సినిమాలో పవన్ నటుడిగా చాలా సన్నివేశాల్లో తేలిపోయాడు. ఆవేశం తప్పితే బాధ, నిస్సహాయత్వం వంటివి అతని కళ్ళల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే.. చాన్నాళ్ల తర్వాత పవన్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. కోర్ట్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫైట్ సీన్స్ లో పవన్ మ్యానరిజమ్స్ ఎప్పట్లానే ఆకట్టుకుంటాయి. పవన్ ఫ్యాన్స్ మెచ్చే అంశాలన్నీ ఉండడంతో వాళ్ళను బాగా సంతృప్తిపరిచాడు పవన్.

నివేదా, అంజలి, అనన్య ఈ ముగ్గురి చుట్టే కథ తిరుగుతుంది. కానీ.. వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ కి సరైన డెప్త్ ఇవ్వలేదు. అలాగే.. అమ్మాయిల పాయింటాఫ్ వ్యూని సరిగా ఎలివేట్ చేయలేదు. అందువల్ల ప్రేక్షకుల మనసుకు తాకాల్సిన వీరి పాత్రలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.

ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ లను సమవుజ్జీవులుగా చూపించే ప్రయాస బాగుంది కానీ.. కరెక్ట్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ ఒకరిమీద ఒకరు రౌడీల్లా అరుచుకుంటున్నట్లు ఉంటాయి వారి వాదనలు. గౌరవనీయమైన కోర్టులో జరుగుతున్న వాదనలా కాక ఏదో రచ్చబండ ముందు ఇద్దరు ప్రత్యర్ధుల్లా ప్రవర్తిస్తుంటారు వీరిద్దరు. ఈ సన్నివేశాల కంపోజిషన్ సరిగా లేనందున ప్రకాష్ రాజ్ లాంటి అద్భుతమైన నటుడు కూడా సరిగా ఎలివేట్ అవ్వలేకపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు వేణు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచాలా? స్క్రిప్ట్ ను జస్టిఫై చేయాలా? అనే మీమాంసలోనే ఉండిపోయాడు. “పింక్, నేరుకొండ పరువాయ్” చిత్రాల థీమ్ & స్టోరీకి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను మిక్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. ఆ ఇబ్బంది ఫస్టాఫ్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. శ్రుతిహాసన్ ను అనవసరంగా ఇరికించారు. కేవలం యంగ్ లాయర్ ఎపిసోడ్స్ చూపిస్తే సరిపోయేది. అలాగే.. ఫస్టాఫ్ మొత్తంలో పోలిటికల్ ఫాలోవర్స్ ను సాటిస్ఫై చేయడానికి పడిన తాపత్రయం బెడిసికొట్టింది. సినిమాలను పోలిటికల్ ఇమేజ్ ను పెంచుకోవడానికి వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. సినిమా జోనర్ బట్టి ఎంతమేరకు వినియోగించుకోవాలి అనేదానికి ఒక కొలమానం ఉంటుంది. దాన్ని వేణు శ్రీరామ్ అస్సలు పట్టించుకోలేదు. కుదిరినప్పుడల్లా “జనాలకు మీరు అవసరం” అని పదే పదే చెప్పడం ఆయన పోలిటికల్ ఫాలోవర్స్ కి నచ్చవచ్చు. కానీ.. కథనానికి అనవసరమనే విషయాన్ని కూడా గుర్తించాల్సింది. ఫస్టాఫ్ తో సాగదీసినా, సెకండాఫ్ మాత్రం లేట్ చేయకుండా కంటెంట్ లోకి దిగిపోయాడు వేణు.

అందువల్ల ఫస్టాఫ్ వల్ల కలిగిన ఇబ్బంది సెకండాఫ్ మొదలవ్వడంతోనే పోతుంది. మెట్రో ఫైట్ సీన్, బాత్ రూమ్ ఫైట్ సీన్ ప్లేస్ మెంట్ & ఎమోషన్ బాగున్నాయి. అలాగే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డైలాగ్స్ పరంగా యూటిలైజ్ చేసుకున్న విధానం కూడా బాగుంది. నిజానికి ఇలాంటి కథను, పాయింట్ ను పవన్ కళ్యాణ్ లాంటి నటుడు చేయడం చాలా అవసరం. ఎందుకంటే.. సగటు పడతి ఆవేదన నేటి యువతరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ప్రేమ అంటే అమ్మాయి వెనకపడడం, హీరోయిజం అంటే అమ్మాయిని ఏడిపించడం అని దాదాపుగా ఫిక్స్ అయిపోతున్న నవతరం యువతకు ఇలాంటి సినిమాలు చెంపపెట్టు. పవన్ కళ్యాణ్ లాంటి హీరో నటించడం వలన ఈ బేసిక్ మెసేజ్ మరింతమందికి చేరువవుతుంది. అయితే.. దర్శకుడు వేణు ఆ ఎండింగ్ ను ఇంకాస్త జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాల్సింది. సినిమా సడన్ గా అయిపోయిన భావన. సినిమా యొక్క థీమ్ & మెసేజ్ అందరికీ రీచ్ అయ్యిందా? అనే సందేహం మాత్రం ఉండిపోతుంది.

తమన్ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేయడమే కాదు, ప్రాణం పోసాడు. మంచి పాటలు, అదిరిపోయే నేపధ్య సంగీతంతో ప్రేక్షకుల్లో హుషారు నింపడమే కాదు, సినిమాలోకి జనాలని ఇన్వాల్వ్ చేసి, సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ ఫ్యాన్స్ ను అలరించింది. అయితే.. కోర్ట్ రూమ్ సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా తీసి ఉండొచ్చు అనిపిస్తుంది. అలాగే.. డి.ఐ వర్క్ మరీ బ్రైట్ గా ఉంటుంది. సినిమా థీమ్ కి తగ్గట్లు కలర్ గ్రేడింగ్ చేసి ఉంటే ఆడియన్ ఇంకాస్త బాగా సినిమాలో లీనమయ్యేవాడు.

పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ ఇవ్వడం వలనో లేక లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్ & రెస్ట్రిక్షన్స్ వల్లనో ప్రొడక్షన్ డిజైన్ ప్రోపర్ గా వర్కవుట్ అవ్వలేదు.

విశ్లేషణ: “పింక్, నేరుకొండ పరువాయ్” చిత్రాలు చూసిన మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చకపోయే అవకాశాలు ఎక్కువ. అందుకు కారణం హిందీ, తమిళ వెర్షన్స్ లో హీరోలు చాలా సైలెంట్ గా కథలోని మెయిన్ పాయింట్ ను ఎలివేట్ చేస్తారు. కానీ.. తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ చెబుతాడు. ఎవరి విధానం వారిదే అయినప్పటికీ.. చెప్పే విధానం బట్టి అర్ధం చేసుకునే తీరు ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే.. హిందీ, తమిళ వెర్షన్ ను చూడని రీజనల్ ఆడియన్స్ & ఫ్యాన్స్ కు “వకీల్ సాబ్” నచ్చేస్తాడు. నచ్చేయడమే కాదు వకీల్ సాబ్ చెప్పే నీతి కూడా అర్ధమవుతుంది, అర్ధమవ్వాలి. ఓవరాల్ గా వకీల్ సాబ్ ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ విత్ ఎ మెసేజ్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ప్లస్ అయితే.. పవన్ కళ్యాణ్ పోలిటికల్ ఫ్యానిజాన్ని ఎలివేట్ చేయడం కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ ఇరికించిన సన్నివేశాలు, డైలాగులు మైనస్. ఆ రాజకీయ భావాలను పక్కనపెడితే.. వకీల్ సాబ్ మెసేజ్ ఇస్తూనే అలరిస్తాడు.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus