విదేశాల్లో ‘మిస్టర్’

వినోదమే ప్రధానోద్దేశ్యంగా యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి విజయాలు సాధించిన దర్శకుడు శ్రీనువైట్ల. గతకొంత కాలంగా ఆయన ఖాతాలో సరైన విజయాలు లేవు. చివరి రెండు చిత్రాలు ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ విజయం సాధించాలని తదుపరి చిత్రకథపై కసరత్తులు చేస్తున్నారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల తాజా చిత్రం చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెభా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘మిస్టర్’ పేరును ఖరారు చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున లాంచనంగా పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభం కానుంది. వేసవిలో చిత్రీకరణ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఊటీలో రచయితలు గోపిమోహన్, శ్రీధర్ సీపానలతో కలసి దర్శకుడు కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్దమవుతోంది. మే 15న మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో మొదలవుతుంది. నెలరోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుతామ”ని తెలిపారు. శ్రీనువైట్ల విజయవంతమైన చిత్రాల తర్వాతలో ‘మిస్టర్’ కూడా పూర్తి వినోదాత్మక యాక్షన్ బాణీలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : జె.యువరాజ్, సంగీతం : మిక్కి జె.మేయర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus