సినిమా ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా ఇప్పుడు పెద్ద విషయం కాకపోయినా, కొందరు నటులు మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో రాజీ పడరు. అలాంటి వారిలో ఒకరు వేణు తొట్టెంపూడి. తాజాగా ఆయనకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వేణు, తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. స్వయంవరం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించారు. మధ్యలో కొంత విరామం తీసుకుని 2021లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు, ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఓ ప్రాజెక్ట్‌లో తనకు జోడీగా యువ నటి అనన్య శర్మను తీసుకోవాలని మేకర్స్ ఆలోచన చేసినప్పుడు, తాను ఆ ఆఫర్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరించానని తెలిపారు. “నా వయసు దాదాపు 50 సంవత్సరాలు. ఆమె మాత్రం చాలా చిన్నది. అలాంటి పరిస్థితిలో ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఆమె నా కూతురిలాంటిది” అని ఆయన స్పష్టం చేశారు.
వేణు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత ట్రెండ్‌లో వయస్సు తేడా పెద్ద విషయం కాదని భావించే వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ, తన విలువలను కాపాడుకోవడంలో వేణు తీసుకున్న స్టాండ్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ఇక అనన్య శర్మ విషయానికి వస్తే, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించి, తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది. ఈ ఘటనతో ఇద్దరి పేర్లు మళ్లీ వార్తల్లో నిలిచాయి.