బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఫాక్స్‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి.
సెకండ్ పార్ట్ లో దేవ్ పాత్ర చాలా కీలకమైనది. మేకర్స్ ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, యష్ లాంటి హీరోలను సంప్రదించారని.. కానీ ఎవరూ అంగీకరించలేదని వార్తలొచ్చాయి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. కరణ్ జోహార్.. దేవ్ పాత్రను విజయ్ దేవరకొండకు ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు.
మొన్నటివరకు హృతిక్, రణవీర్, యష్ అని మీడియాలో వార్తలొచ్చాయని.. రేపు ప్రభాస్ పేరు వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వెటకారంగా అన్నారు. అయితే దేవ్ పాత్రకి వస్తోన్న బజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అన్నారు. జనాలు ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారని.. త్వరలోనే యాక్టర్ ని ఫైనల్ చేస్తామని, ఇప్పటివరకు అయితే ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.
ఆయన మాటలతో ఒక క్లారిటీ వచ్చేసింది. 2023 చివరిలో ‘బ్రహ్మాస్త్ర2’ షూటింగ్ మొదలుకానుంది. 2025లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి కూడా హిట్ టాక్ వస్తే.. పార్ట్ 3ని తెరకెక్కిస్తారు.