మురుగదాస్.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ విజయ్ కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త ప్రచారంలో ఉంది. సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించే చర్చ. మురుగదాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఈ వార్త కి మరింత బలాన్ని ఇచ్చింది. ఐతే ఇది వర్కవుటవుతుందో లేదో కానీ.. ఆయన చెబుతున్న దాని ప్రకారం తెలుగు వెర్షన్లో మహేష్ హీరోగా ఉండి విజయ్ విలన్ పాత్రను పోషిస్తే.. తమిళ వెర్షన్లో విజయ్ ని హీరోగా మహేష్ ను విలన్ గా చూపిస్తాడట.
కానీ మహేష్ బాబు నెగెటివ్ రోల్ చేయడం అనే మాటనే జనాలు ఊహించలేకపోతున్నారు. విజయ్ విషయంలో తమిళ ప్రేక్షకుల ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది. నిజంగా మురుగదాస్ ఈ ఆలోచనను తెరమీదికి తీసుకొస్తే ఈ చిత్రానికి హైప్ మామూలుగా ఉండదు. ఇంతకుముందు మణిరత్నం ‘రావణ్’ విషయంలో ఇలాంటి ప్రయోగం చేశాడు. తెలుగు-తమిళ వెర్షన్లలో విలన్ పాత్ర చేసిన విక్రమ్.. హిందీలో హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు మురుగదాస్ చెబుతున్న ఆలోచన కూడా ఎగ్జైటింగ్ గానే అనిపిస్తోంది. ఐతే ‘స్పైడర్’ తర్వాత విజయ్ తోనే సినిమా చేస్తానన్న మురుగదాస్ ఇందులోనే మహేష్ కు చోటు కల్పిస్తాడా.. లేక తర్వాత ఎప్పుడైనా వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.