తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. నిజానికి తమిళంలో సీక్వెల్ తీయనప్పటికీ తెలుగులో మాత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. నిన్ననే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం స్టార్ హీరోని తీసుకుంటామని మేకర్లు తెలిపారు. ఇప్పుడు ఆ హీరో ఎవరనే విషయంలో కాస్త క్లారిటీ వస్తోంది.
దర్శకుడు రమేష్ వర్మ ఇటీవల చెన్నైకి వెళ్లి విజయ్ సేతుపతిని కలిసినట్లు తెలుస్తోంది. ‘రాక్షసుడు 2’ స్క్రిప్ట్ ను అతడికి వినిపించడం కోసమే రమేష్ వర్మ చెన్నైకి వెళ్లాడట. విజయ్ కి స్క్రిప్ట్ నచ్చినప్పటికీ.. ఇంకా సినిమా చేయడానికి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ వరుస ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నారు. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆయన డైరీ మొత్తం కాల్షీట్స్ తో నిండిపోయింది.
తన సినిమా షెడ్యూల్స్ ని బట్టి రమేష్ వర్మకి డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ ‘ఖిలాడి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ‘రాక్షసుడు 2’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం!