Vikram K Kumar: ‘థాంక్యూ’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్..!

  • July 15, 2022 / 03:45 PM IST

అక్కికేని నాగ చైత‌న్య హీరోగా ‘థాంక్యూ’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.’శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు.గతంలో నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మనం’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ‘థాంక్యూ’ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ .. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్ర. ఈ సినిమాకి ‘థాంక్యూ’ అనే టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది?

విక్రమ్ కుమార్ : ‘థాంక్యూ’ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిజానికి ఇది చాలా ప‌వ‌ర్‌ఫుల్ ప‌దం. దానికి మ‌నం విలువ లేకుండా చేశాం. దాని అసలైన ప్రాముఖ్యతని తెలపాలన్న ఉద్దేశమే మా సినిమా కథాంశం. అందుకే ఈ టైటిల్ ను పెట్టాం.

ప్ర.మీరు నిజ జీవితంలో ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అని చెప్పలేకపోయిన సందర్భాలు ఉన్నాయా?

విక్రమ్ కుమార్ : నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్న‌గారు. ఆయ‌న‌కు నేను ఏ రోజూ థాంక్స్ చెప్ప‌లేదు. కానీ ఓరోజు ఆయ‌న ఈ లోకాన్ని విడిచి పెట్టేసి వెళ్లిపోయారు. నిజానికి మ‌న త‌ల్లిదండ్రులు మ‌న నుంచి థాంక్యూ అనే ప‌దాన్ని ఆశించరు. ఒక‌వేళ మనం చెప్పినా వాళ్ళకు కోపం వ‌స్తుంది. కానీ మ‌నం వారికి థాంక్యూ చెప్పాలి.

ప్ర. ‘మనం’ తర్వాత నాగ చైతన్య గారితో ‘థాంక్యూ’ చేశారు. ఎలా అనిపిస్తుంది.?

విక్రమ్ కుమార్ : 3,4 ఇయర్స్ నుండి నేను, చైత‌న్య క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ మా వద్దకు వ‌చ్చింది. ఇందులో నాగ చైత‌న్య 3 వేరియేష‌న్స్‌లో క‌నిపిస్తారు. అందులో 16 ఏళ్ల పిల్లాడిలా క‌నిపించే పాత్ర ఒక‌టి ఉంది. అలాగే 20-21 ఏళ్ల వ‌య‌సుండే కుర్రాడిగా క‌నిపిస్తారు. తర్వాత 35-40 ఏళ్ల వ్య‌క్తిగా క‌నిపిస్తారు.

16 ఏళ్ల కుర్రాడిగా క‌నిపించ‌డం కోసం చైత‌న్య చాలా క‌ష్ట‌ప‌డ్డారు. 40-50 రోజుల పాటు స్పెష‌ల్ డైట్ తీసుకుని బ‌రువు త‌గ్గి త‌న లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్ర‌కు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైత‌న్య‌కే ద‌క్కుతుంది.

ప్ర. ట్రైలర్ చూస్తుంటే ‘థాంక్యూ’ లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ ‘ప్రేమమ్’ చిత్రాల పోలికలు కనిపిస్తున్నాయి?

విక్రమ్ కుమార్ : ప్రేమ‌మ్‌,నా ఆటోగ్రాఫ్ అనేవి చాలా గొప్ప సినిమాలు. అలాంటి సినిమాల‌తో మా ‘థాంక్యూ’ సినిమాను పోల్చితే మాకు చాలా ప్ల‌స్ అయిన‌ట్లే. ఇది ఒక వ్య‌క్తి జ‌ర్నీ. అలాంటి కోవ‌కు చెందిన సినిమానే అయినా ఆ సినిమాల‌కు దీనికి ట‌చ్ ఉండ‌దు.

ప్ర. మొదటి సారి మీరు వేరే రచయిత ఇచ్చిన కథతో సినిమా చేస్తున్నారు.. కారణం?

విక్రమ్ కుమార్ : బి.వి.ఎస్ రవి వచ్చి ఈ క‌థ‌ను చెప్ప‌గానే క‌థ‌లోని మెయిన్ సోల్ నాకు చాలా బాగా న‌చ్చింది. ఆ సోల్‌ను నా స్టైల్‌లో ఆడియన్స్‌కు చెప్పాల్సిన అవ‌స‌రం నాకు ఉంది అనిపించింది. అలా ముందుకు వెళ్లాం. ద‌ర్శ‌కుడిగా నేను వేరే క‌థ‌కు క‌నెక్ట్ కాలేన‌ప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌లేను క‌దా.

ప్ర. మొదటి సారి సంగీత దర్శకుడు తమన్ తో పనిచేశారు.. ఎలా అనిపించింది?

విక్రమ్ కుమార్ : ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని స్క్రీన్‌పై చూపించాలంటే మంచి మ్యూజిక్ చాలా ముఖ్యం. త‌మ‌న్ మా సినిమాకు అద్బుత‌మైన సంగీతాన్ని అందించారు. రీసెంట్‌గా బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాను. చాలా బాగా చేశాడు. మ‌న‌సు పెట్టి మ్యూజిక్ అందించాడు త‌మ‌న్‌.

ప్ర.ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో పనిచేసారు? ఎలా అనిపించింది?

విక్రమ్ కుమార్ : రాశీ ఖన్నా పాత్ర.. అభిరామ్ జ‌ర్నీలో చాలా కీల‌కమ‌ని చెప్పాలి. అభిరామ్ పాత్ర‌ను క‌థ‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసే పాత్ర ఆమెది. అందులో ఆమె చాలా బాగా చేసింది. ఓ సీన్ లో అయితే చాలా ఎక్సలెంట్‌గా చేసింది. దాన్ని నేను మానిట‌ర్‌లో చూసిన‌ప్పుడు నా క‌ళ్ల‌ల్లోనూ నీళ్లు తిరిగాయి.ఇక మాళ‌వికా నాయర్ అద్భుత‌మైన న‌టి. ఆమెకి ఇంకా సరైన సినిమాలు పడలేదు అని నా ఫీలింగ్. ‘థాంక్యూ’ త‌ర్వాత ఆమె ఇంపార్టెన్స్ మ‌రింత‌గా పెరుగుతుంది. అవికా గోర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆమె చిన్న‌ప్ప‌టి నుండీ న‌టిగా మెప్పిస్తూనే ఉంది.

ప్ర. ‘థాంక్యూ’ ద్వారా మెసేజ్ వంటిది కూడా ఇస్తున్నారా?

విక్రమ్ కుమార్ : మ‌న‌లో చాలా మంది జీవితంలో ఎన్నో క‌ష్టాలు ప‌డి ఈ స్థాయికి వ‌చ్చామ‌ని అనుకుంటూ ఉంటారు. కానీ వారి స‌క్సెస్‌లో ఇత‌రుల స‌పోర్ట్ ఎంతో ఉంటుంది. దాన్ని ఎవ‌రూ గుర్తించ‌రు. గుర్తించినా.. అహంతో ఉండిపోతారు. కానీ మన సక్సెస్‌లో భాగ‌మైన వారికి థాంక్స్ చెప్ప‌టంలో ఓ సంతోషం ఉంటుంది. మ‌న జీవితంలో మార్పుకు వ్య‌క్తులే కార‌ణంగా ఉండాల‌నేం లేదు. కొన్ని సందర్భాలు కూడా మ‌న‌లో మార్పుని తీసుకొస్తాయి. ఏదేమైనా మ‌న‌లో ఆ కృత‌జ్ఞ‌తాభావం అనేది ఉండాలి అని చెప్పడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం.

ప్ర. దిల్ రాజు గారి బ్యానర్ల చేయడం ఎలా అనిపించింది?

విక్రమ్ కుమార్ : నేను దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో చేస్తున్న మొదటి చిత్రమిది. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను.చాలా సార్లు కథల గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. ఈ సినిమా ప‌ర్ఫెక్ట్ అనుకున్నాం.

నేను, రాజుగారు, పి.సి గారు ‘థాంక్యూ’ ని ద్వి భాషా చిత్రంగా రూపొందించాలి అనుకున్నాం. కానీ చివ‌ర‌కు తెలుగులోనే చేయడం జరిగింది. కానీ ఇదొక యూనివ‌ర్స‌ల్ పాయింంట్.

ప్ర.నాగ చైతన్యతో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా? అదెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది?

విక్రమ్ కుమార్ : నాగ చైత‌న్య‌, నేను క‌లిసి ‘దూత’ అనే వెబ్ సిరీస్‌ ‘అమెజాన్ ప్రైమ్’ కోసం చేస్తున్నాం. ఈరోజుతో నాగ చైత‌న్య పాత్ర‌కు సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మ‌రో 15 రోజుల్లో చిత్రీక‌రణ మొత్తం పూర్త‌వుతుంది.

ప్ర. 24 సినిమాకి సీక్వెల్ ఎప్పుడు ఉండొచ్చు?

విక్రమ్ కుమార్ : 24 సినిమాకు సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌నైతే ఉంది. ఓ నాలుగైదు పేజీల్లో ఏం చేయాల‌నే ఆలోచన‌ను కూడా రాసుకున్నాను. కానీ పూర్తి స్థాయిలో రెడీ చేయ‌లేదు. అందులో ఆత్రేయ పాత్ర‌ను ఎలా ఆవిష్క‌రించాల‌నే దానిపై ఆలోచిస్తున్నాను.ఆ పాత్ర లేకపోతే 24 సీక్వెల్ పై జనాలకు ఆసక్తి ఉండదు.

ప్ర. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

విక్రమ్ కుమార్ : ప్ర‌స్తుతం ‘మైత్రీ మూవీ మేక‌ర్స్’ బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క‌థ‌ రెడీ అవుతుంది.అలాగే ఓ బాలీవుడ్ ప్రాజెక్టు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పూర్తి వివ‌రాల‌ను వెల్లడించలేను కానీ… హిందీలో చేయ‌బోయేది యాక్ష‌న్ మూవీ.

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus