తమిళనాటు ధనుష్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ యువ నటుడిగా కెరీర్ ప్రారంభించి, తన వినూత్నమైన నటన.. కథల ఎంపికతో వావ్ అనిపించాడాయన. ఇటీవల ‘అసురన్’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ఆ జోరును చూపిస్తూ ‘కర్ణన్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో కొంతమంది అభిమానులు ఆ సినిమా బ్యానర్‌ను సముద్రంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.
అభిమాన నటుడు కోసం ఏదైనా చేయడానికి అభిమానులు సిద్ధమవుతుంటారు. కొన్ని సందర్భాల్లో సాహసాలు కూడా చేస్తుంటుంటారు. తాజాగా ధనుష్ కోసం ఇప్పుడు అలాంటి పనే చేశారు ఆయన అభిమానులు. పుదుచ్చేరిలోని సముద్రం తీరం నుండి కొంత దూరం లోపలకు వెళ్లి, నీటి మధ్యలో ఉన్నస్థంభాలకు ధనుష్ బ్యానర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత 20 ఏళ్లుగా ధనష్ సినిమా వచ్చినప్పుడు అక్కడి అభిమాన సంఘాలు ఈ తరహా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం.
‘కర్ణన్’కు సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రాజీషా విజయన్, ‘96’ ఫేమ్ గౌరీ కిషన్, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ గ్రామంలో పోలీసు ఆఫీసర్ వల్ల ఇబ్బందులు పడ్డ యువకులు… దానిని ఎదుర్కోవడానికి ఏం చేశారు అనేదే సినిమా కథ అని తెలుస్తోంది. జాతీయ ఉత్తమనటుడి నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.