ఆది నుంచి వైవిధ్య చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఆయన దర్శకత్వంలో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తెలుగు వారి ఖ్యాతితో పాటు క్రిష్ ట్యాలెంట్ ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ను మణికర్ణిక సినిమాగా మలుస్తున్నారు. ఇది ఒక వైపు.. మరో వైపు విషయం ఏమిటంటే యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ ని రూపొందిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. మరో పాత్రలో సమంత మెరుస్తోంది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం క్రిష్ కష్టపడుతున్నారు. కన్ఫ్యూజ్ గా ఉంది కదూ. క్రిష్ కి సావిత్రికి సంబంధం ఏమిటని.. ? అక్కడకే వద్దాం. మహానటి చిత్రంలో మాయాబజార్ సినిమాకు దర్శకత్వం వహించిన కెవి రెడ్డి గారి సన్నివేశం కూడా ఉంది. ఆ క్యారెక్టర్ లో క్రిష్ నటించనున్నారు.
అందుకోసం మీసకట్టు మార్చుకున్నారు. కేవీ రెడ్డి గా క్రిష్ ఉన్న ఫోటో బయటికి లీకయింది. అదికూడా మణికర్ణిక షూటింగ్ స్పాట్ లో కెమెరాకి క్రిష్ చిక్కడం.. ఆ ఫోటో వైరల్ అవ్వడం వేగంగా జరిగిపోయింది. క్రిష్ ఈ పాత్ర కోసం ఎంత హోమ్ వర్క్ చేశారో ఈ ఫోటో స్పష్టం చేసింది. వైజయంతి మూవీస్ వారు ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంతో సావిత్రి గురించి అనేక ఆసక్తికర సంగతులు తెలియనున్నాయి.