టాలీవుడ్‌లో నిర్మాతల స్నేహం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా వినిపించే యువ నిర్మాత పేరు నాగవంశీ. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆయన వరుస సినిమాలు చేస్తుంటారు. ఆ సినిమాలను రిలీజ్ చేయడం విషయంలో ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు అయిన దిల్ రాజు, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లతో, థియేటర్ల ఓనర్లతో కాస్త డిఫరెన్స్‌లు వచ్చాయి. ఆ విమర్శల వేడి ‘తల’కు తగిలింది కూడా.
అయితే, ఇప్పుడు నాగవంశీ స్నేహానికి పరీక్ష పెట్టే పరిస్థితి మరోసారి టాలీవుడ్‌లో వచ్చిందా? అంటే అవును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే నాగవంశీకి వారం గ్యాపులో రెండు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మొదటిది వెంకటేశ్ – త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’. ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదిన విడుదలవుతోంది. ఈ సినిమాను అనుకోని పరిస్థితుల్లో వారం వాయిదా వేశారు. ఇప్పుడు ఈ మార్పు నాగవంశీని టైట్ చేసేసింది.
ఎందుకంటే అక్టోబర్ 15 విడుదల కానున్న రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ‘జైలర్ 2’ తెలుగు వెర్షన్ పంపిణి హక్కులు నాగవంశీనే తీసుకున్నారు. ఏపీ తెలంగాణ ఆయనే రిలీజ్ చేస్తారు. ఈ మేరకు దిల్ రాజును దాటి ఆ సినిమా రైట్స్ అందుకున్నారు. ఈ లెక్కన ‘ఏకే 47’ సినిమా థియేటర్లను వారం తర్వాతే రజనీకాంత్ సినిమా కోసం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు అక్టోబరు 16న రావాల్సిన ‘రణబాలి’ సినిమాకి కూడా కొన్ని థియేటర్లను విడిచి పెట్టాలి.
ఈ సినిమాల విడుదల కోసం నాగవంశీ కచ్చితంగా అటు దిల్ రాజు.. ఇటు మైత్రీ సాయం తీసుకుంటారు. సాయం చేసే సమయంలో వారికి నెక్స్ట్ వారంలో థియేటర్లు ఇవ్వాలి. దీంతో స్నేహం కచ్చితంగా టెస్టింగ్‌కి గురవుతుంది. కాబట్టి అక్టోబరు రెండో వారం ఆయనకు పెద్ద పరీక్షే పెట్టనుంది అని చెప్పొచ్చు.