Ram Pothineni: అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

రామ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. తన సినిమాలోని పాత్రనే కాదు, బయట కూడా సూపర్‌ హైపర్‌ ఆ మనిషి. హిట్‌ ట్రాక్‌లో ఉన్నాడంటే ఇంకా బంపర్‌ హైపర్‌ అవుతాడు. అయితే ఇటీవల సరైన విజయాలు అయితే రావడం లేదు. ఈ సమయంలో మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్‌’ అనే సినిమా అనౌన్స్‌ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌ కొంతవరకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే పెద్ద పెద్ద దర్శకులతో విజయాలు అందుకోవడంలో ఇబ్బందిపడుతున్న రామ్‌.. కుర్ర దర్శకుడితో ఓకేనా అని. అయితే ట్రెండ్‌ అలానే ఉంది మరి.

Ram Pothineni

ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమా కోసం రామ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఇప్పుడు ఆసక్తిరేకెత్తిస్తోంది. కావాలంటే మీరే చూడండి. ఒకప్పుడు సినిమాలో నటించామా, బాగా ప్రచారం చేశామా, హిట్‌ అయితే ఎంజాయ్‌ చేశామా, లేదంటే గమ్మునున్నామా అనేలా ఉండే రామ్‌ ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా అవతారాలు ఎత్తుతున్నాడు. మొన్నీమధ్య పాట రాస్తే.. ఇప్పుడు ఏకంగా పాట పాడాడు. హీరోలు పాడటం అనేది కొత్త కాకపోయినా రామ్‌ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేదే డౌట్‌.

‘ఏయ్‌ హిట్‌ కొట్టాం.. సౌండ్‌ పెట్టరా.. రయ్‌ రయ్యంటూ రచ్చే లేపరా’ అంటూ తను అభిమాన హీరో సినిమా హిట్‌ అయినందుకు స్టెప్పులు వేశాడు రామ్‌ పోతినేని. ఇదంతా ‘ఆంధ్రకింగ్‌ తాలూకా’ సినిమా నుండి ఇటీవల వచ్చిన ‘పప్పీ షేమ్‌’ అనే పాటలో అనే విషయం మీకు తెలిసిందే. ‘బిత్తర చూపులు ఏంటన్నా.. ఇక్కడున్నది ఆంధ్రకింగ్‌ అన్నా..’’ అంటూ పాట మంచి హుషారుగా ఉంది. దాన్ని పాడింది రామ్‌. ఇక ‘నువ్వుంటే చాలే’ అనే మొదటి పాటను ఆయనే రాశాడు.

ఇదంతా ఓకే కానీ.. జడ్జిమెంట్‌ లోపం వల్ల గతంలో సినిమాలతో ఇబ్బందిపడ్డ రామ్‌ ఇప్పుడు కథ ఎంపిక, నటనతోపాటు ఈ అదనపు అంశాల మీద ఎందుకు దృష్టి సారిస్తున్నాడు? సినిమా మీద ఎక్కువ నమ్మకమా? లేక సినిమా విషయంలో అన్నీ దగ్గరుండి చూసుకొని ఎలాగైనా హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్నాడా అనేది చూడాలి. ఈ విషయంలో తేలాలంటే టీమ్‌ గతంలో చెప్పినట్లుగా నవంబరు ఆఖరులో సినిమా రావాలి.

 మొదటి ‘జాతిరత్నం’ నవీన్‌ కాదట.. ఈ కుర్ర హీరోను దాటుకుని..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus