సహజమైన సినిమాల మధ్యలో సిల్లీ ఫెలోస్ ను పట్టించుకొంటారా

  • September 5, 2018 / 06:17 AM IST

ఒకవారంలో మూడు నాలుగు సినిమాలు రిలీజవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ… ఈవారం విడుదలవుతున్న మూడు తెలుగు సినిమాల నడుమ చోటు చేసుకోనున్న సంఘర్షణ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. స్టార్లు లేకుండా కేవలం కంటెంట్ ను నమ్ముకొని తెరకెక్కించిన “కేరాఫ్ కంచరపాలెం, మను” లాంటి సహజమైన సినిమాలతోపాటు సీనియర్ కామెడియన్స్ అల్లరి నరేష్, సునీల్ కలిసి నటించిన “సిల్లీ ఫెలోస్” కూడా విడుదలవుతోంది. నిజానికి మూడు చిన్న సినిమాల కిందే లెక్క కానీ “సిల్లీ ఫెలోస్”లో సునీల్, అల్లరి నరేష్ ఉన్నారు కాబట్టి ఈ మూడిట్లో సిల్లీ ఫెలోస్ ను పెద్ద సినిమాగా పేర్కొనాల్సి వస్తుంది.

అయితే.. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈమధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాను ఆదరించే విధానం, పద్ధతి మారిపోయింది. సినిమాల ఎన్ని సన్నివేశాలున్నాయి, ఎన్ని లొకేషన్స్ లో షూట్ చేశారు, ఎన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి అనే విషయాన్ని మెలమెల్లగా పట్టించుకోవడం మానేస్తున్నారు. అందుకే అర్ధవంతమైన చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో “కేరాఫ్ కంచరపాలెం, మను” చిత్రాలను కాదనుకొని “సిల్లీ ఫెలోస్” థియేటర్లకి వెళ్ళే ప్రేక్షకులు ఉన్నప్పటికీ.. ఆ సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి తరుణంలో అసలే హిట్ అనే పదం విని చాలా ఏళ్లవుతున్న సునీల్-నరేష్ లు ఇలా “సిల్లీ ఫెలోస్”తో హిట్ కొడతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది? ఏ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొంటుంది? అనేది తెలియాలంటే మాత్రం ఇంకో రెండ్రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus