టాలీవుడ్‌లో దశాబ్దాలుగా తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అనేలా యంగ్ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు బాలయ్య. సింహ, లెజెండ్, అఖండ, డాకు మహారాజ్ వంటి భారీ విజయాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన బాలయ్య. యాక్షన్, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్ విషయంలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి సినిమాలు సాధించిన కలెక్షన్లు చూస్తే, బాలయ్య మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతుంది.
ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారారు. గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా మేళవించి రూపొందుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్‌పై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలయ్య చుట్టూ యంగ్ మరియు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మలయాళ హిట్ దర్శకుడు హనీఫ్ అదేని తో ఒక ప్రాజెక్ట్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలు అందించిన వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోవైపు కొరటాల శివ పేరు కూడా బాలయ్య ప్రాజెక్ట్‌తో వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
డైరెక్టర్లు బాలయ్య వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. ఆయన దర్శకులకు ఇచ్చే పూర్తి స్వేచ్ఛ. ఒకసారి కథకు ఓకే చెప్పాక మేకింగ్‌లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకువెళ్లటం, టైమ్ కమిట్‌మెంట్, మార్కెట్ గ్యారెంటీ, అందుబాటులో రెమ్యూనరేషన్ ఉండటం. ఇవన్నీ కలిసే బాలయ్యను దర్శకుల ఫేవరెట్ హీరోగా నిలబెడుతున్నాయి. అందుకే ఇప్పుడు బాలయ్య లైన్‌లో సినిమాల జాబితా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.