Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే తమిళంలోనే కాదు, తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడతాయి. విడుదలకు ముందు సినిమా చుట్టూ ఓ రేంజ్‌లో సందడి నెలకొంటుంది. కానీ, మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) విషయంలో మాత్రం అలాంటి హడావుడి ఏమీ కనిపించడం లేదనే చెప్పాలి. 3 ఏళ్ళ క్రితం వచ్చిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నిజానికి ఆ సినిమాకు కూడా మొదట్లో పెద్దగా బజ్ లేదు.

Jailer 2

కానీ, అనిరుధ్ సంగీతం, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. దానికి తోడు విడుదల రోజున పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగిపోయాయి. కానీ, ‘జైలర్ 2’ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన పాటలు విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు.

పోనీ చిత్రబృందం ఏమైనా మీడియా సమావేశాలు ప్లాన్ చేసి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? అంటే అదీ లేదు. కనీసం ఈరోజు జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సైతం క్యాన్సిల్ అయ్యింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ‘జైలర్ 2’కి తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే టికెట్ ధరలు ఎక్కువగా పెట్టారు. ఈ నిర్ణయం పట్ల తెలుగు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇదొక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడం, పైగా రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా కావడంతో.. విడుదలకు ముందు బజ్ లేకపోయినా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మొదటి రోజు పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంటే చాలు, సినిమా బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా గట్టెక్కేస్తుంది. మరి ఆ అవకాశాన్ని అయినా ‘జైలర్ 2’ వాడుకుంటుందో లేదో చూద్దాం..!

2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus