83 Movie Review: 83 సినిమా రివ్యూ & రేటింగ్!

టీం ఇండియా గెలుచుకున్న మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ కథాంశంగా తెరకెక్కిన చిత్రం “83”. కపిల్ దేవ్ సెమీ బయోపిక్ లాంటి సినిమా ఇది. కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం షూటింగ్ 2021లోనే పూర్తైనప్పటికీ.. కరోనా & లాక్ డౌన్ కారణంగా ఏడాదిపాటు విడుదల విషయంలో క్లారిటీ లేక ఇబ్బందిపడిన ఈ చిత్రం ఎట్టకేలకు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని నాగార్జున సమర్పించడం విశేషం. మరి ఈ స్పొర్ట్స్ డ్రామా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ లకు వెళ్లడమే తప్ప ఏనాడూ కనీసం సెమీ ఫైనల్ కు కూడా వెళ్లని టీం ఇండియా.. మొట్టమొదటిసారి 1983లో సెమీ ఫైనల్ కు వెళ్లడమే కాక.. వరల్డ్ కప్ కూడా గెలుచుకుంది. అందుకోసం టీం ఇండియా పడిన కష్టం ఎలాంటిది? ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ఎవరి బయోపిక్ మీదైనా ప్రేక్షకులకు పూర్తిస్థాయి అవగాహన ఉంటుందో లేదో తెలియదు కానీ.. క్రికెటర్స్ లేదా క్రికెట్ బయోపిక్ అనేసరికి మాత్రం సగం పైగా ప్రేక్షకులకు చాలా నిశితమైన పరిజ్ణానం ఉంటుంది. అందుకే క్రికెటర్స్ బయోపిక్స్ అంటే లుక్స్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ ప్రతి విషయంలోనూ సదరు పాత్ర పోషించే ప్రతి నటుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కపిల్ దేవ్ గా నటించిన రణవీర్ సింగ్ నుంచి మాన్ సింగ్ గా నటించిన పంకజ్ వరకూ ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. శ్రీకాంత్ గా జీవా ఇంకాస్త ఎక్కువ మార్కులు సంపాదించాడు. అతిధి పాత్రల్లో దీపికా పడుకోణే, వామిఖా గబ్బి, పార్వతి నాయర్, బోమన్ ఇరానీ, అదితి ఆర్య ఇలా ప్రతి ఒక్కరూ సినిమాకి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు కబీర్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా బయోపిక్ లు అంటే అనవసరమైన డ్రామా ఎక్కువగా ఉంటుంది. కానీ.. “83” విషయంలో కబీర్ ఖాన్ ఆ తప్పు చేయలేదు. సరిగ్గా సినిమాను వరల్డ్ కప్ మ్యాచ్ తోనే మొదలెట్టాడు, ఆ మ్యాచ్ తోనే ముగించాడు. ఆ నడిమధ్యలోనే అంతా సాగింది. సినిమాటిక్ లిబర్టీస్ కాస్త ఎక్కువగా తీసుకున్నప్పటికీ.. ఎమోషన్స్ ను క్యారీ చేయడానికి ఆమాత్రం ఉండాలి అనిపించింది. అయితే.. ఆర్మీ సీన్ ఒక్క విషయంలో కాస్త పరిణితి ప్రదర్శించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా వెస్టిండీస్ & జింబాంబేలతో ఇండియా తలపడే మ్యాచ్ లను చిత్రీకరించిన విధానం బాగుంది. ఎమోషన్ ను క్యాప్చ్యూర్ చేయడంలో వందశాతం విజయం సాధించాడు కబీర్ ఖాన్. అలాగే.. ప్రతి ఒక్క నటుడి నుంచి చక్కని ప్రదర్శన రాబట్టుకున్నాడు.

ప్రీతం పాటలు తెలుగులో ఆకట్టుకొనే విధంగా లేకపోయినా.. జూలియస్ పెకీయం నేపధ్య సంగీతం మాత్రం ఉద్వేగాన్ని కలిగించింది. అసీమ్ మిశ్రా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అయితే.. ఉద్విగ్నతకు గురిచేసే స్థాయి ఫ్రేమ్స్ ఎక్కడా కనిపించలేదు. ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బాగుంది. ఆర్ట్ & సీజీ వర్క్ టీంను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. వీఎఫ్ఎక్స్ లో ఒక్క మిస్టేక్ లేకుండా జాగ్రత్తపడ్డారు.

విశ్లేషణ: 1983 నాటి వరల్డ్ కప్ ను విన్న (రేడియో ద్వారా), చూసిన జనాలకు “83” చిత్రం ఓ డాక్యుమెంటరీ లాంటిది, అయితే.. అప్పటికి పుట్టని నేటి తరానికి ఈ చిత్రం ఓ మధుర జ్ణాపకంన లాంటిది. అతి లేకుండా చక్కని ఎమోషన్స్ తో ఎలివేషన్స్ తో నడిచే “83” ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని తప్పక చూడాల్సిన చిత్రం.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus