Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆయుష్మాన్ ఖురానా (Hero)
  • రష్మిక మందన్న (Heroine)
  • నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, ఫైసల్ మాలిక్ తదితరులు (Cast)
  • ఆదిత్య సర్పోట్ దార్ (Director)
  • దినేష్ విజన్ - అమర్ కౌశిక్ (Producer)
  • సచిన్ - జిగర్ (Music)
  • సౌరభ్ గోస్వామి (Cinematography)
  • హేమంతి సర్కార్ (Editor)
  • Release Date : అక్టోబర్ 21, 2025
  • మ్యాడాక్ ఫిలిమ్స్ (Banner)

బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ హిట్ మిషీన్ అంటున్న దినేష్ విజన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన తాజా చిత్రం “థామా”. ఈ సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. స్త్రీ యూనివర్స్ లో ఇంటర్ లింక్ చేసిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మిస్టికల్ సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగింది? తెలుగు వెర్షన్ ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

Thamma Movie Review

కథ: కెరీర్లో సక్సెస్ అవ్వలేకపోతున్నా అనే బాధతో కొన్ని రోజులు చిల్ అవుదామని ఒక అడివికి స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్తాడు అలోక్ (ఆయుష్మాన్ ఖురానా). అక్కడ అనుకోని సందర్భంలో తాడక అలియాస్ తారిక (రష్మిక మందన్న) పరిచయం అవుతుంది.

అయితే తారిక అందరిలాగా మనిషి కాదని, ఆమె భేతాళ జాతికి చెందిన అమ్మాయి అని తెలుసుకుంటాడు అలోక్. ఇంతకీ ఆ భేతాళ జాతి అక్కడ ఏం చేస్తుంది? ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఏమిటి? వాళ్లని అలోక్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది “థామా” కథాంశం.

నటీనటుల పనితీరు: ఆయుష్మాన్ ఖురానాకి ఈ తరహా పాత్రలు కొత్త కాదు. యాడ్ చేసిన చిన్న మిస్టికల్ ఎలిమెంట్ మినహా ఆయుష్మాన్ కి అంతా కేక్ వాక్ లాంటిదే. చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. రష్మిక బాలీవుడ్ డెబ్యూ కావడంతో క్యారెక్టర్ లో కావాల్సినదానికంటే ఎక్కువ కంగారు కనిపించింది. అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం కాస్త ఎక్కువగానే చేసింది. అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చవచ్చేమో కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. ఆమె పాత్రకి చాలా స్కోప్ ఉన్నప్పటికీ.. ఎందుకో ఎస్టాబ్లిష్మెంట్ కానీ పే ఆఫ్ కానీ సరిగా కుదరలేదు.

ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర కూడా మిస్ ఫిట్ అనిపించింది. ఎంత వెటకారంగా చూపించాలనుకున్నా.. పాత్ర ఆ ప్రపంచంలో ఇమడడం అనేది చాలా ముఖ్యం. నవాజుద్దీన్ ఎందుకో తనకి సంబంధం లేని సినిమాలో ఉన్నట్లుగా కనిపించాడు.

పరేష్ రావల్, గీతా అగర్వాల్, ఫైసల్ మాలిక్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా ఉంటే బాగుండేది. స్త్రీ & స్త్రీ2 ల కంటే చాలా తక్కువ స్థాయి అవుట్ పుట్ కనిపించింది సినిమా విషయంలో. అలాగే.. బ్రైట్ నెస్ కూడా సినిమా థీమ్ కి తగ్గట్లుగా తగ్గించారు కానీ.. అది సినిమాకి ఎఫెక్ట్ అయ్యిందని చెప్పాలి.

అలాగే.. డబ్బింగ్ విషయంలో కనీస స్థాయి కేర్ తీసుకోలేదు. ట్రూ ట్రాన్స్లేషన్ వాడేశారు. సినిమాలో ఒకటికి పదిసార్లు సమతుల్యత అనే పదం వాడతారు, ప్రస్తుతం థియేటర్లకి వచ్చే జెన్ జీ ఆడియన్స్ లో ఎంతమందికి ఆ పదం యొక్క అర్థం తెలుసు అనేది కూడా చూసుకోలేదు. అలాగే.. హీరో క్యారెక్టర్ కి ప్రేమలు సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పిన దుర్గ అభిషేక్ తోనే డబ్బింగ్ చెప్పించారు. అది మ్యాచ్ అవ్వలేదు. పాపం అతను కష్టపడినప్పటికీ.. అవుట్ పుట్ సరిగా రాలేదు. అలాగే.. పాటల సాహిత్యం విషయంలో కూడా కనీస స్థాయి జాగ్రత్త తీసుకోలేదు. తెలుగు వెర్షన్ విషయంలో సంతోషపడాల్సిన విషయం ఏంటంటే.. తెలుగు ఫాంట్స్ లో బూతులు లేకుండా చూసుకున్నారు. సచిన్ – జిగర్ ద్వయం సమకూర్చిన పాటలు హిందీలో ఓ మోస్తరుగా ఉండగా.. తెలుగులో మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉన్నా.. గ్రాఫిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో.. అవి సరిగా లేకపోవడం కారణంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దర్శకుడు ఆదిత్య సర్పోట్ దార్ తన మునుపటి సినిమా “ముంజ్యా” ఫార్మాట్ ని మళ్లీ ఈ సినిమాకి కూడా వాడాడు. అందులో తప్పేమీ లేదు కానీ.. ముంజ్యాలో ఫ్లాష్ బ్యాక్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి, ఆ సెంటిమెంట్ ను బేస్ చేసుకొని మిగతా సినిమా అంతా నడిపించిన ఆదిత్య, “థామా” విషయంలో మాత్రం ఆ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో దారి తప్పాడు. అందువల్ల మిగతా సినిమా చాలా పేలవంగా సాగుతుంది. అలాగే.. ఏ ఒక్క క్యారెక్టర్ కి కూడా సరైన జస్టిఫికేషన్ లేకుండాపోయింది. దాంతో దేనికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇక కామెడీ కూడా ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. ఇక సినిమాలో ఇరికించిన “బేడియా” కూడా తదుపరి సినిమాలకి పనికొచ్చేలా ఉంది కానీ.. “థామా”కి పనికిరాలేదు. అందువల్ల.. దర్శకుడిగా ఆదిత్య ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.

విశ్లేషణ: హారర్ అయినా మిస్టికల్ అయినా కామెడీ సినిమాల్లో కేవలం జోకులు ఉంటే జనాలు చూసేస్తారు అనేది ప్రస్తుతం వర్కవుట్ అవ్వని విషయం. దినేష్ విజన్ & టీమ్ ఈ విషయాన్ని ఇప్పుడైనా గ్రహించాలి. లేకపోతే “థామా” లాంటి సినిమాలు వచ్చి వెళ్లినట్లు కూడా ప్రేక్షకులు గుర్తించకుండా అయిపోతుంది. అయితే.. “థామా” ఎంగేజ్ చేయకపోయినా, టైమ్ పాస్ కి ఒకసారి చూడొచ్చు. తెలుగు వెర్షన్ కాకుండా హిందీలో చూడడం ఉత్తమం.

ఫోకస్ పాయింట్: రష్మిక బాలీవుడ్ డెబ్యూ వర్కవుట్ అవ్వలేదు!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus