ఏకంగా డజను ఫ్లాపుల అనంతరం “ఇష్క్, గుండేజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న యువ కథానాయకుడు నితిన్.. ఆ తరువాత “చిన్నదాన నీకోసం” చిత్రంతో కథానాయకుడిగా సూపర్ ఫ్లాప్స్ సొంతం చేసుకొని రేసులో వెనుకబడ్డాడు. సో, మళ్ళీ ఓ సూపర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలన్న ధృడ నిశ్చయంతో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం “అ ఆ”. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రంతో.. “ప్రేమమ్” ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మరి “అ ఆ” నితిన్ కు సూపర్ హిట్ తెచ్చిపెట్టిందా? కథానాయికగా వరుస ఫ్లాపులతో చతికిలపడిన సమంతకు ఊరటనిచ్చిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మా సమీక్షను పూర్తిగా చదవాల్సిందే..!!
కథ : విజయవాడకు దగ్గరలోని ఓ అందమైన పల్లెటూరుకు చెందిన యువకుడు ఆనంద్ విహారి (నితిన్). హైద్రాబాద్ లో తన తల్లి అడుగుజాడల్లో తప్పక నడిచే అమ్మాయి అనసూయ రామలింగం. ఈ ఇద్దరి మధ్య పరిచయం ఎటువంటి పరిణామాలకు దారి తీసింది? వీరి ప్రేమకు అడ్డంకిగా నిలిచిన సమస్యలేమిటి? వీరి ప్రేమ గెలవడానికి తోడ్పడిన విషయాలేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే “అ ఆ”.
నటీనటుల పనితీరు : కేవలం హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. సినిమాలోని ప్రతి పాత్రధారి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు. ఆనంద్ విహారిగా నితిన్, అనసూయ రామలింగంగా సమంతలు సదరు పాత్రలో ఒదిగిపోయారు. ఒద్దిక, బాధ్యత సమపాళ్లలో కలిగిన యువకుడిగా నితిన్ పరిణితి చెందిన నటన కనబరిచాడు.
అమాయకత్వం, చిలిపిదనం కలగలసిన ఆధునిక యువతిగా సమంత అలరించింది. “బొమ్మరిల్లు” సినిమాలో తండ్రిపాత్రను పోలిన తల్లి పాత్రకు నదియా ప్రాణం పోసింది. విలనిజం ఉండదు కానీ విలన్ లా నటించిన రావురమేష్ మాత్రం అదరగొట్టేశాడు. తనదైన శైలి మేనరిజమ్, సంభాషణలు పలికిన తీరు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
కూతురంటే అమితమైన ప్రేమ ఉన్న తండ్రిగా, భార్య పట్ల బాధ్యతతో కూడిన ఆప్యాయత కలిగిన భర్తగా నరేష్ ఈ సినిమాలో ఆకట్టుకొన్నారు. “ప్రేమమ్” ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ “నాగవల్లి” పాత్రలో తన కళ్ళతోనే నటించేసింది. అజయ్, హరితేజ, ప్రవీణ్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు : ఛాయాగ్రాహకుడు సుబ్రహమణ్యం నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమునూ ఓ అందమైన పెయింటింగ్ గా తీర్చిదిద్దాడు. నైట్ ఎఫెక్ట్ కోసం వాడిన లైటింగ్ చాలా నేచురల్ గా ఉంది. మిక్కీ సమకూర్చిన బాణీలు ఆల్రెడీ సూపర్ హిట్, ఇక సినిమాలో ఆ పాటలను అత్యద్భుతంగా చిత్రీకరించడంతో.. విజువల్ గానూ ఆకట్టుకొన్నాయి.
త్రివిక్రమ్ ఆస్థాన ఎడిటర్ అయిన ప్రవీణ్ పూడి లేని లోటు చాలా సన్నివేశాల్లో తెలుస్తుంది. 154 నిమిషాల్లో దాదాపుగా ఓ 15 నిమిషాల నిడివి గల అనవసరమైన సన్నివేశాలు అగుపిస్తుంటాయి. కోటగిరి వెంకటేశ్వర్రావు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. రాధాకృష్ణ నిర్మాణ విలువలను మెచ్చుకొని తీరాలి. ప్రతి ఫ్రేములోనూ ఆయన పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు కనిపిస్తుంటుంది.
రచన-దర్శకత్వం : ఒక రచయితగా త్రివిక్రమ్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన ఈమధ్య కథ-కథనాల కంటే పంచ్ డైలాగులు మరియు ప్రాసల మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారన్నది ఆయన మునుపటి చిత్రాల చూస్తేనే అర్ధమవుతుంది. అయితే.. “అ ఆ” సినిమాతో ఆ విషయం స్పష్టమవుతుంది.
కథ కొత్తది కాదు, కథనం అంతకంటే కొత్తది కాదు కానీ.. పాత్రల వ్యవహారశైలి మాత్రమే సినిమాను బతికించింది. దర్శకుడిగా మాత్రం కేవలం క్లైమాక్స్ లోనే తన సత్తా చాటుకోగలిగాడు త్రివిక్రమ్. ఏవో కొన్ని సీన్స్ మినహా మరెక్కడా త్రివిక్రమ్ శైలి కనిపించదు. త్రివిక్రమ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం ఇది.
విశ్లేషణ :
సినిమాను సినిమాగా చూస్తే ఎటువంటి గోల ఉండదు. కానీ.. సినిమాలోని పాత్రలను ఒన్ చేసుకొన్నప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. “అ ఆ”లో మనకి ఎదురయ్యే సమస్య అదే. పాత్రల్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా, ఆ పాత్రలు కేవలం నటిస్తున్నాయి అనుకొంటే ఏమీ అవ్వడు కానీ.. కథలో లేక పాత్రల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ప్రేక్షకుడు నిరాశచెందక తప్పదు.
అన్నిటికంటే ముఖ్యంగా.. “అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ” అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫికేషన్ అనేది సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు.
ఫైనల్ గా చెప్పాలంటే..
అందమైన లొకేషన్స్, ఆహ్లాదపరిచే పాత్రల వ్యవహారశైలి.. అన్నిటికీ మించి ఆకట్టుకొనే పతాక సన్నివేశం కలగలిసి “అ ఆ” చిత్రాన్ని ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలబెట్టాయి.
రేటింగ్: 3/5
CLICK HERE FOR ENGLISH REVIEW