2009 లో హిందీలో విడుదలై అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించి సంచలనాత్మకంగా నిలిచిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా, వినోద్ చోప్రా బ్యానర్ లో విధు వినోద్ చోప్రా ఈ మూవీని నిర్మించాడు. అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు. 2009 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25కి విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావటమే కాకుండా 3 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంట్లో భాగంగా ఈ మధ్యనే దర్శకుడు ఒక ఆలోచనతో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్టు సినీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే 3 ఇడియట్స్ మూవీలోని పాత్రలు 15 సంవత్సరాల తరువాత కలుసుకుంటే, ఆ తరువాత జరిగే సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబందించి అధికారికంగా ఏ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ అతి త్వరలోనే ఆఫీసియల్ స్టేట్మెంట్ రానుందట.
దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదట్లో ఫిల్మ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి మున్నా భాయ్ ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో డైరెక్టర్ గా మెగాఫోన్ చేతపట్టి ఆ తరువాత ‘3 ఇడియట్స్’,’ పీకే’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.