ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

తెలుగు భాష మీద ప్రేమాభిమానులను తన సినిమాల ద్వారా వ్యక్తపరిచే అతి తక్కువ మంది దర్శకుల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. అయితే.. ఆయన మునుపటి చిత్రం “వి” దారుణంగా నిరాశపరిచింది. మరి తాజా చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”తో విజయాన్ని అందుకున్నారో లేదో చూడాలి. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ పెద్ద బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!

కథ: 5 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ నవీన్ (సుధీర్ బాబు) తన ఆరో సినిమా కథ రాసుకుంటున్న సమయంలో అనుకోకుండా అలేఖ్య (కృతిశెతి) షోరీల్ చూస్తాడు. సినిమా తీస్తే ఆ అమ్మాయితోనే తీయాలి అని ఫిక్స్ అవుతాడు.

అయితే.. అలేఖ్య & ఫ్యామిలీకి సినిమాలంటే విపరీతమైన అసహ్య భావన ఉంటుంది. అయినప్పటికీ.. వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా మొదలెడతాడు నవీన్. నవీన్ సినిమా పూర్తిచేయగలిగాడా లేదా? అందుకోసం అతను పడిన ఇబ్బందులు ఏమిటి? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: సుధీర్ బాబు నటుడిగా ఇంప్రూవ్ అవుతున్నా.. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోతున్నాడు. సదరు సన్నివేశాల్లో అతడి నటనలో ఈజ్ కాకుండా కష్టం కనిపిస్తోంది. అందువల్ల ఆ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమవుతుంది. చలాకీ కుర్రాడిగా అలరిస్తున్న సుధీర్ బాబు, ఎమోషనల్ సీన్స్ లో మాత్రం వెనకబడుతున్నాడు. ఈ విషయంలో జాగ్రత్తపడితే మాత్రం నటుడిగా కచ్చితంగా ఎదుగుతాడు.

“ఉప్పెన” తర్వాత కృతిశెట్టి పోషించిన మంచి పాత్ర “అలేఖ్య”. చక్కని వేరియేషన్స్ ను అద్భుతంగా పండించింది. ఆమె కళ్లను ఇంద్రగంటి ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికి వినియోగించుకున్న తీరు బాగుంది. లిప్ సింక్ మిస్ అవ్వకుండా ఆమె డైలాగులు చెప్పిన విధానం ప్రశంసనీయం. రైటర్ పాత్రలో రాహుల్ రామకృష్ణ జోకులు పండకపోయినా.. సినిమాపై ఇంద్రగంటికి ఉన్న ప్రేమ వ్యక్తమైంది. వెన్నెల కిషోర్, అవసరాల కామెడీ ట్రాక్ ఓ మోస్తరుగా నవ్వించింది.

సాంకేతికవర్గం పనితీరు: మొట్టమొదటిసారి వివేక్ సాగర్ సంగీతం ఒక సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పాటల్లో కూడా మునుపటి ఆల్బమ్స్ తరహాలో మ్యాజిక్ కనిపించలేదు. పిజి విందా మాత్రం ఎప్పట్లానే తన కెమెరా వర్క్ తో ఆకట్టుకున్నాడు.  కేవలం లైటింగ్ & టింట్ కలర్ తో ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన విధానం అభినందనీయం. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. దర్శకుడు ఇంద్రగంటి టేస్ట్ & తెలుగు భాష మీద ఉన్న ప్రేమను మెచ్చుకోకుండా ఉండలేము.

ఎక్కడా అసభ్యతకు, అనవసరమైన వ్యంగ్యానికి తావు లేకుండా.. కమర్షియల్ సినిమాలపై తన అభిప్రాయాన్ని రాహుల్ రామకృష్ణ పాత్ర ద్వారా వ్యక్తపరుస్తూనే.. సినిమాపై తనకు ఉన్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు ఇంద్రగంటి. ఈ క్రమంలో స్క్రీన్ ప్లే విషయంలో కాస్త గాడి తప్పాడు. అందువల్ల.. కథ బాగున్నా, కథనం అలరించే విధంగా లేకపోవడంతో.. సినిమా ఆకట్టుకోవడంలో చాలా చోట్ల విఫలమైంది. అయితే.. ఇంద్రగంటి చెప్పాలనుకున్న ఎమోషన్స్ మాత్రం బాగా వర్కవుటయ్యాయి. అందువల్ల.. దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నా.. కథకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఇంద్రగంటి.

విశ్లేషణ: కమర్షియల్ సినిమాలు, ఫైట్లు కాకుండా.. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను అలరించే చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. చిన్నపాటి ల్యాగ్ & స్క్రీన్ ప్లేలో బోర్ ను భరించగలిగితే ఈ చిత్రం అలరిస్తుందనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంద్రగంటి రాసిన ప్రేమకథ ఈ చిత్రం.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus