సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ నటి, భారతదేశపు తొలి మహిళా మిమిక్రీ ఆర్టిస్ట్ అయినటువంటి ఆశా సింగ్ జైస్వాల్(Aasha Singh Jaiswal) ముంబైలో కన్నుమూశారు. గత 3 నెలల నుండీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆశా సింగ్ జైస్వాల్. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూనే ఆమె ఆగస్టు 22, 2026 న రాత్రి 7:30 గంటలకి మృతి చెందినట్టు తెలుస్తోంది.
ఆశా సింగ్ మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆశా మరణవార్తని ఆమె కుమారుడు ఆకాశ్ భరద్వాజ్ అలియాస్ ఆకాశ్ సింగ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆకాశ్ తన తల్లిని ‘కర్మఠ్ లోహ్-మహిళ'(ఐరన్ లేడీ) అంటూ అభివర్ణించాడు. ఆమె ఆత్మకు సద్గతి, శాంతి చేకూరాలని ప్రార్థించాలని అందరినీ కోరుతున్నట్టు రాసుకొచ్చాడు. ఆశా సింగ్ చేసిన సేవలను కూడా అంతా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్బంగా గుర్తుచేశాడు.
ఆశా సింగ్ జైస్వాల్ నటిగానే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా..! లెజెండరీ నటి మీనా కుమారి గాత్రాన్ని అద్భుతంగా అనుకరించి అందరినీ అలరించి పాపులారిటీ పొందారు. అలాగే ఆమె ‘ఆశా ఈవెంట్స్ అండ్ ఫిల్మ్స్’ అనే సంస్థను కూడా స్థాపించి ఎంతో మందికి పని కల్పించారు. ‘బాజీగర్’, ‘తేరీ తలాష్ మే’, ‘బేచైన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అలాగే ‘మహాభారత’ సీరియల్‌లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఆశా సింగ్.
ఇక ఆశా సింగ్ అంత్యక్రియలు ఆగస్టు 23(ఈరోజు) ఉదయం 10 గంటలకు ముంబైలోని విలే పార్లే వెస్ట్, పవన్ హన్స్‌లో నిర్వహించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.