అభిమన్యుడు

  • June 1, 2018 / 03:42 AM IST

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “అభిమన్యుడు”. గత నెల తమిళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “ఇరుంబుతురై” చిత్రానికి అనువాదరూపమిది. విశాల్ సరసన సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నెగిటివ్ రోల్ ప్లే చేయడం విశేషం. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలనం సృష్టించింది. మరి తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ : కరుణాకర్ (విశాల్) ఆర్మీలో ట్రయినింగ్ ఆఫీసర్. విపరీతమైన కోపిష్టి, ఆ కోపం కారణంగా ట్రయినింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ను నానా ఇబ్బందులు పెడతాడు. దాంతో హీరోగారి మీద కంప్లైంట్స్ ఎక్కువవుతాయి. అన్నీ రకాలుగా ఫిట్ & మోస్ట్ ఎలిజిబుల్ అయిన కరుణాకర్ కేవలం కోపం కారణంగా ఒక్కోసారి కంట్రోల్ లో ఉండకపోతుండడానికి ఆర్మీ తప్పుబట్టి.. ఒక సైక్రియార్టిస్ట్ వద్దకు వెళ్ళి అతడు/ఆమె నుంచి మెంటల్ గా పర్ఫెక్ట్ అని ఒక లెటర్ తీసుకురమ్మంటారు. అలా డాక్టర్ లతా దేవి (సమంత)ను కలుస్తాడు కరుణాకర్.

ఈ కోపం పోగొట్టే సెషన్స్ జరుగుతుండగా.. తండ్రితో కలిసి లోన్ అప్లికేషన్ కోసం అన్నీ బ్యాంకులు తిరిగి ఎవరూ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ గా అప్లై చేస్తారు. ఆ డబ్బు పడినట్లే పడి ఎకౌంట్ లో నుంచి మాయమవుతాయి. అదెలా జరిగిందో తెలియక తికమకపడుతున్న తరుణంలో.. ఇదంతా పెద్ద డిజిటల్ స్కామ్ అని తెలుసుకొంటాడు కరుణాకర్. ఆ స్కామ్ వెనుక ఉన్నది సంఘంలో పేరుప్రఖ్యాతులు కలిగిన సత్యమూర్తి అలియాస్ వైట్ డెవిల్ అని తెలిసినప్పటికీ.. సరైన ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కరుణాకర్ కి ఆర్మీ ఇంటిలిజెన్స్ అండగా నిలుస్తుంది. ఆ ఆర్మీ ఇంటిలిజెన్స్ ను ఆసరాగా చేసుకొని కరుణాకర్ ఒన్ మేన్ ఆర్మీగా సత్యమూర్తి ఆగడాలను ఎలా అరికట్టాడు అనేది “అభిమన్యుడు” కథాంశం.

నటీనటుల పనితీరు : కోపిష్టి మిలిటరీ ఆఫీసర్ గా విశాల్ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. అలాగే.. తనకంటే పదింతలు తెలివైన శత్రువును ఎదుర్కొనే ధీరుడిగా విశాల్ నటన అతడి కెరీర్ బెస్ట్ అని చెప్పుచ్చు. ఫైట్స్ విషయంలో ఎప్పట్లానే సరికొత్తగా అలరించాడు.

డాక్టర్ రతీదేవిగా సమంత మరోమారు అందం-అభినయంతో ఆకట్టుకొంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఎక్కడా అందాల ప్రదర్శనకు తావు లేకుండా నిండైన చీరకట్టుతో అలరించింది సమంత.

ఇక అర్జున్ ఈ సినిమాలో వైట్ డెవిల్ గా టిపికల్ మ్యానరిజమ్స్ & క్యారెక్టరైజేషన్ తో ఆశ్చర్యపరిచాడు. విశాల్-అర్జున్ కాంబినేషన్ సీన్స్ సినిమా టెంపోని బాగా పెంచాయి. సినిమాకి ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సన్నివేశంలోని ఎమోషన్ కు తగ్గట్లుగా ఆయన యూజ్ చేసిన లైటింగ్, వాడిన ఫ్రేమింగ్స్, కలరింగ్ & టింట్ సినిమలోకి ప్రేక్షకుడ్ని ఇన్వాల్వ్ చేయడానికి తోడ్పడ్డాయి.

యువన్ శంకర్ రాజా సమకూర్చిన బాణీలు తెలుగీకరణ కారణంగా పాడైనా.. నేపధ్య సంగీతం మాత్రం ఆకట్టుకొనే విధంగా ఉంది. డిజిటిల్ ట్యూన్స్ యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. సౌండ్ డిజైనింగ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవడం వలన ప్రేక్షకుడికి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించగలిగారు చిత్రబృందం.

దర్శకుడు పి.ఎస్.మిత్రన్ రాసుకొన్న కథ బాగుంది. కానీ.. విలన్ క్యారెక్టరైజేషన్ “ధృవ” సినిమాలో అరవిందస్వామిని తలపిస్తే.. కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ ఫిలిమ్ “డై హార్డ్ 4.0” సినిమాను గుర్తుకుతెస్తాయి. అయితే.. ఆధార్ కార్డ్ ఇష్యూ & కేవలం ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఇతరులకు సంబంధించిన కంప్లీట్ డేటాను ఎలా దుర్వినియోగపరచవచ్చు అనే విషయాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో చిత్రీకరించిన విధానం మాత్రం ప్రేక్షకుల్ని కొన్ని గంటల వరకూ ఫోన్ వాడాలంటే భయం పుట్టేలా చేస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్ తో ఇన్ని చేయొచ్చా అని అందర్నీ ఆలోజింపజేసేలా తెరకెక్కించాడు పి.ఎస్.మిత్రన్. కథ-కథనం అద్భుతంగా రాసుకొన్న మిత్రన్ సాంగ్స్ విషయంలో మాత్రం తప్పు చేశాడు. కథ భలే రంజుగా సాగుతుందనుకొంటున్న తరుణంలో అనవసరంగా పాటలు ఇరికించి ఇబ్బందిపెట్టాడు. ఆ పాటల్ని పక్కన పెట్టేస్తే.. టెక్నాలజీ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం, అదే ఇన్ఫర్మేషన్ కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో, భవిష్యత్ లో ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించాడు మిత్రన్. అందుకు మాత్రం అతడ్ని మెచ్చుకోవాల్సిందే.

విశ్లేషణ : మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు.. అలరించే కథ, ఆకట్టుకొనే కథనం ఉన్న “అభిమన్యుడు” అందరికీ నచ్చుతాడు. కాకపోతే.. డబ్బింగ్ క్వాలిటీ, సాంగ్స్ కాస్త బాగుంటే సినిమా ఇంకాస్త బాగుండేది అని మాత్రం అనిపిస్తుంటుంది.

రేటింగ్ : 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus