సినీ పరిశ్రమలో గత 45 రోజులుగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్ లు,అలాగే ఇంకా కొన్ని విభాగాలకు చెందిన టెక్నీషియన్లు,నిర్మాతలు,నటులు వంటి వారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. మీనా భర్త, రాధిక శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి, కమెడియన్ సారధి, సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు కంటమనేని ఉమా మహేశ్వరి వంటి వారు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ కమెడియన్ రఘు కారుమంచి తండ్రి కూడా మృతి చెందడం మరోసారి టాలీవుడ్లో విషాద ఛాయలు ఏర్పడేలా చేసాయి. రఘు కారుమంచి అలియాస్ ‘అదుర్స్’ రఘు తండ్రి వెంకట్రావు కారుమంచి ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న వెంకట్రావు గారు గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. జూన్ 10, 1947లో జన్మించిన వెంకట్రావు గారు ఆర్మీ అధికారిగా దేశానికి ఎన్నో సేవలందించారు.
రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. కొడుకు కమెడియన్ గా రాణిస్తున్నందుకు ఆయన సంతోషంగానే ఉంటూ వచ్చారు. ఇక వెంకట్రావు గారి మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులతో పాటు రఘుకి ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రఘు కారుమంచి 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలంగాణ స్లాంగ్ లో ఈయన పలికే డైలాగులు మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తాయి. ‘జబర్దస్త్’ లో కూడా ఇతను టీం లీడర్ గా ఎన్నో స్కిట్స్ వేసిన సంగతి తెలిసిందే.