మెగాస్టార్ చిరంజీవి సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 హీరో. అందులో ఎలాంటి డౌట్ లేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి తోటి హీరోల కంటే కూడా చిరంజీవి సినిమాలు ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డులు సృష్టించేవి. అందుకే చిరు సినిమాలకు పోటీగా తమ సినిమాలను పోటీగా దించడానికి ఆ స్టార్ హీరోలు కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది ఇక చిన్న హీరోలు సాహసిస్తారా? కానీ చాలా సార్లు చిరంజీవి సినిమాలకు పోటీగా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.
కానీ చిరంజీవి సినిమాల మేనియాలో అవి కొట్టుకుపోయాయి. కానీ ఒక చిన్న సినిమా.. చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాకి పోటీగా రిలీజ్ అయ్యి కూడా మంచి విజయం సాధించింది. 2004 అక్టోబర్ 15న ఈ అద్భుతం చోటు చేసుకుంది. అవును.. ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ సినిమా రిలీజ్ అయ్యింది. జయంత్ సి పరాన్జీ ఆ సినిమాకు దర్శకుడు. ఆ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ సినిమా పక్కన మరో సినిమా రిలీజ్ అవుతుంది అని ఎవరూ ఊహించరు.
కానీ రాజా హీరోగా నటించిన ‘ఆనంద్’ అనే సినిమాని రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా వస్తుందని మొదట చాలా మందికి తెలీదు. అయినా సరే పెద్ద సాహసం చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. శేఖర్ కమ్ముల చిరంజీవికి వీరాభిమాని. అయినా సరే తన సినిమాని పోటీగా రిలీజ్ చేయడానికి కారణం.. ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ సినిమాకి టికెట్ దొరకని వాళ్ళు ‘ఆనంద్’ కి వస్తారు అనే నమ్మకంతో ‘ఆనంద్’ ని విడుదల చేశారట. ఆ రకంగా ‘ఆనంద్’ సినిమాకి మంచి పబ్లిసిటీ జరిగింది. తర్వాత క్లీన్ హిట్ గా నిలిచింది.