కొత్త సినిమాలను పైరసీ చేస్తూ.. ఇండస్ట్రీని వేధించిన ఐబొమ్మ రవి మొత్తానికి పోలీసులకు చిక్కాడు. ఎక్కడో వేరే దేశాల్లో ఉంటూ.. తెలుగు సినిమాల్ని పైరసీ చేసి అతను నెట్లో పెట్టి.. ఇండస్ట్రీకి చాలా డ్యామేజ్ చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి పోలీసులకు దొరకడంతో ఇండస్ట్రీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ‘అతను టాలెంటెడ్ అని..కచ్చితంగా దేశానికి పనికొస్తాడని’ నటుడు శివాజీ తెలిపారు.
శివాజీ మాట్లాడుతూ.. “ఆడేవడో ఒకడు ఉన్నాడు(ఐబొమ్మ రవి). ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాడి గురించి. వాడేంటండీ బాబు. అంటే వాడికేదో బాధ. మొత్తానికి పట్టేశారు వాడిని. అయితే ఆ అబ్బాయి చాలా మంచి హ్యాకర్ అని విన్నాను. కానీ అతన్ని మంచికి వాడుకోవాలని కోరుకుంటున్నాను. వాడు దేశానికి ఉపయోగపడే మనిషిగా మారితే బాగుంటుంది. కనీసం ఇక నుండి అయినా మారతాడు అనుకుంటున్నాను.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. అతను ప్రూవ్ చేశాడు. చేసింది దుర్మార్గమైన పనే అయినప్పటికీ.. అతను చేసిన పని గురించి వింటుంటే.. కచ్చితంగా అతను దేశానికి పనికొస్తాడు కదా అనిపిస్తుంది. కచ్చితంగా సెక్యూరిటీ సిస్టమ్లో వాడుకోవచ్చు. బహుశా తెలిసీ తెలియని వయసు. డబ్బు లేని పరిస్థితి అయ్యుండొచ్చు. ఇవన్నీ అతన్ని వెంటాడి.. చాలా మందిని ఇబ్బంది పెట్టాడు.
తనకు తెలియదు.. చాలా మందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ.. మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బ్రతకాలి కాబట్టి.. దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుండి అయినా అతను మారాలని కోరుకుంటున్నాను” అంటూ ఐబొమ్మ రవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.