‘హను – మాన్ ’ అంటూ ఓ చిన్న సినిమా చేసి.. పెద్ద సినిమాలతో పోటీ పడి రిలీజ్ చేసి.. పెద్ద సినిమాలకు మించిన వసూళ్లు అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తామని క్లైమాక్స్‌లోనే ప్రకటించారు. అయితే ఆ సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పట్టింది.. నిర్మాత మారారు, సెటప్ అంతా మారిపోయింది. చాలామంది హీరోల పేర్లు చర్చలోకి వచ్చి.. చివరకు రిషభ్ శెట్టి ఓకే అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకే సమాచారం ఇప్పటివరకు అయితే లేదు.
కానీ.. ఇప్పుడు ఓ సమాచారం బయటకు వచ్చింది. సినిమాలో కీలక పాత్ర కోసం యువ కథానాయిక, లేటెస్ట్ హిట్ మెషీన్ మమితా బైజును ఓకే చేశారు అని చెబుతున్నారు. అంతేకాదు ఆమె సినిమా సెట్స్‌లో కూడా అడుగుపెట్టింది అని టాక్. త్వరలో ఈ మేరకు ఓ ప్రకటన వస్తుందని సమాచారం. అయితే ఆ పాత్ర ఏంటి అనేది తెలియడం లేదు. ‘హను – మాన్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన తేజా సజ్జా ఈ సినిమాలో ఉంటాడో లేదో తెలియదు. అయితే రానా మాత్రం ఓ పాటలో ఉంటాడట.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లెహోం కుటుంబ యూనిట్’ అంటూ వరుస విజయాలతో దూకుడు మీదుంది మమితా బైజు. ఈ క్రమంలోనే ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలిసింది. మరోవైపు ‘కాంతార’ ఫ్రాంఛైజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి తెలిసిందే. సరైన బ్లాక్‌బస్టర్ అందుకున్నా.. ఆ తర్వాతి సినిమాలు చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే చేసిన రెండు సినిమాలూ ఆగిపోయాయి.
ఇప్పుడు టాలీవుడ్ డైరక్టర్, శాండిల్‌వుడ్ హీరో, మాలీవుడ్ హీరోయిన్‌తో ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతోంది. ఆ లెక్కన ఈ సినిమా పాన్ ఇండియా టచ్‌లు బాగా వచ్చాయి. ఇంకా కోలీవుడ్, బాలీవుడ్ నుండి యాడ్ ఆన్స్ యాడ్ అవ్వాల్సి ఉంది. మరి ఎవరొస్తారో చూడాలి.