మేమే లీక్ చేస్తాం.. మేమే టైటిల్ రిలీజ్ చేస్తాం.. లీక్ అయిన టైటిల్‌కి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని మేమే అంటాం.. తర్వాత కూడా ఇలాంటి ఓవరాక్షన్ కొనసాగొచ్చు అని చెప్పేస్తాం. బాగుంది కదా ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ వాడి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు రవితేజ (Ravi Teja) అండ్ కో. ఆయన కొత్త సినిమా ‘తులాభారం’ సినిమా గురించే ఇదంతా. ఈ సినిమాను ఈ రోజు అధికారికంగా ప్రకటించి, ప్రారంభించారు.
పైన చెప్పిన డాక్యుమెంటరీ చూస్తే.. చాలా అంశాలు అర్థమవుతున్నాయి. ఓ చీకటి గదిలో ఒక్కొక్కరు కూర్చుని మాట్లాడుకుంటున్న వీడియోను సిద్ధం చేశారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సినిమా పేరేంటి, సినిమా జోనర్ ఏంటి అనేది చెప్పకనే చెప్పారు. సినిమా కాన్సెప్ట్‌ని ప్రధాన పాత్రలతో రివీల్ చేయడం, చివర్లో తమ టైటిల్‌పై తామే పంచ్ వేసుకోవడం బాగుంది. అయితే గ్లింప్స్‌లో కొన్ని బూతులు దాదాపుగా వినిపించాయి. కొన్ని కావాలనే బీప్ చేశారు.
రవితేజ మాటల్లో, ఆయన సినిమాల్లో ఇలాంటి బీప్ బూతులు గతంలో చూశాం. అయితే వివేక్ ఆత్రేయ అలా కాదు. ఆయన సినిమాలు క్లీన్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం ఆయన రవితేజ మార్క్‌లోకి వచ్చేశారు. ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే ఇది సినిమా కాదు. ఒక జనరల్ కాన్వర్జేషన్‌లా చూపించారు కాబట్టి. కానీ సినిమాలోకి దీన్ని తీసుకొస్తే రవితేజ.. ఇంకా ఆయన కుమార్తె మోక్షద కష్టపడి ‘ఇరుముడి’తో సంపాదించుకున్న వైబ్ దెబ్బతింటుంది.
ఒక్కొక్కరు ఒక్కో జోనర్ అంటున్నారు.. మేం చెబుతాం అసలు జోనర్ ఏంటో అంటూ ఈ సినిమాను టీజ్ చేసిన టీమ్.. ఫైనల్‌గా ఆ జోనర్ ఏంటో చెప్పలేదు. రవితేజ లుక్ చూస్తుంటే మాస్ రోల్ అనిపిస్తున్నా… క్రైమ్, కామెడీ, పొలిటికల్, సర్వైవల్, లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, కపుల్ లవ్, ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తారు అని అర్థమవుతోంది.