నలుగురూ ఓ టాపిక్ గురించి ఒక యాంగిల్‌లో మాట్లాడుకుంటే.. తాను మాత్రం దానికి చిత్రవిచిత్రమైన అభిప్రాయాలను, కథలను జోడిస్తూ ఉంటారు ప్రముఖ నటి కస్తూరి (Kasthuri Shankar) . అందులో నిజానిజాలు ఎంత అనేది సగటు జనాలను తెలియకపోయినా.. ఆమె మనల్ని ఏదో అంది అనే మాట మాత్రం తెలుస్తుంది. అన్నట్లు కొన్నిసార్లు ఆమె చెప్పిన విషయంలో నిజం కూడా ఉండొచ్చు. తాజాగా ఆమె ఇలానే తెలుగు వాళ్ల గురించి, అందులోనూ శతాబ్దాల క్రితం తమిళనాడు వలస వచ్చిన తెలుగు వాళ్ల గురించి మాట్లాడారు.
బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో నవంబర్ 4న చెన్నైలో నిరసన జరిగింది. ఆ కార్యక్రమంలోనే కస్తూరి మాట్లాడుతూ తెలుగు వారిని అవమానిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమె తొలుత తన మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత పరిస్థితి గమనించి కాస్త మెత్తబడ్డారు. ఇప్పుడు ఫైనల్‌గా తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
జరగబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి కామెంట్స్‌ను వెనక్కి తీసుకున్నా.. చిక్కులు తప్పేటట్టు లేవు. ఎందుకంటే తమిళనాడులో ఆమె వ్యాఖ్యల మీద కేసులు పడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన కస్తూరి… తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు అందులో రాసుకొచ్చారు. తాను కొంతమంది గురించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల విషయంలో జరుగుతున్న పరిణామాలను తన తెలుగు స్నేహితులు వివరించారని.. విషయం తెలుసుకున్న తర్వాత ఇలా స్పందిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వంపై తనకు గౌరవం ఉందన్నారు.
జాతి, ప్రాంతాలకు అతీతంగా తాను ఉంటానని చెబుతూ తెలుగు వారితో ఉన్న అనుబంధాన్ని కస్తూరి (Kasthuri Shankar) గుర్తు చేసుకున్నారు. తనకు పేరు తెచ్చిపెట్టింది తెలుగువారే అని చెప్పారు. తన కామెంట్స్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అలాగే తమిళనాడులో జరుగుతున్న బ్రాహ్మణుల పోరాటంలో పాలు పంచుకోవాలని తెలుగు వారికి ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రంలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశంతో కస్తూరి కామెంట్స్ చేశారంటూ.. చెన్నై ఎగ్మూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె మీద నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు.