Dasari Narayana Rao: దాసరి నారాయణ తరువాత ఆ గౌరవం అతడికేనా ..?

  • April 26, 2023 / 07:36 PM IST

దాసరిని ‘గురువుగారు’ అని పరిశ్రమలో పిలుచుకునేవారు. ఎందుకంటే అతని దగ్గర పనిచేసిన ఎంతోమందికి అతను ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాడు. మరి ఈ తరంలో ఇప్పుడు సుకుమార్ కూడా అదే కోవలో వెళుతూ… దివంగత దర్శక రత్న దాసరి నారాయణ రావు తెలుగు సినిమా పరిశ్రమలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే 150కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించటమే కాకుండా, సినిమా క్రాఫ్ట్స్ అన్నిటిమీద కమాండ్ వున్న ఏకైక వ్యక్తి అతను. దర్శకత్వంతో పాటు నటన, రచన, మాటలు, పాటలు, సంగీతం, ఒకటేమిటి అన్నీ చెయ్యగల సత్తా వున్న మనిషి దాసరి.

ఎంతోమంది నటీనటులను తెలుగు తెరకి పరిచయం చేసిన వ్యక్తి కూడా దాసరే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాసరి శిష్యులు కూడా చాలామంది తెలుగు పరిశ్రమలో దర్శకులుగా స్థిరపడ్డారు, అందులో కోడి రామకృష్ణ లాంటి దర్శకుడు వంద సినిమాలకి పైగా కూడా దర్శకత్వం వహించారు. దాసరిని అందుకే ప్రేమగా అందరూ గురువుగారు అని పిలుచుకుంటూ ఉండేవారు. అయితే మళ్ళీ అలాంటి వైభవం అగ్ర దర్శకుడు సుకుమార్ కి దక్కింది అని పరిశ్రమలో అంటున్నారు. అతను అగ్ర దర్శకుల్లో ఒకడుగా ఎదగడమే కాకుండా, తన శిష్యులను కూడా ఎంతో ప్రోత్సహిస్తూ తనలాగే ఎదగడానికి చేయూత నిస్తున్న దర్శకుడు సుకుమార్.

తన శిష్యులనే కాదు, కొత్తవారు ఎవరైనా ప్రోత్సాహం ఇస్తూ ముందుకు నడిపించే వ్యక్తి సుకుమార్. అందులో విరూపాక్ష దర్శకుడు ఒకడు. గత వారం విడుదల అయిన ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు, ఇది ఇతనికి రెండో సినిమా. సుకుమార్ అతని కథ వినగానే ఇది హిట్ అవుతుంది అని నమ్మి అతనికి ప్రోత్సాహం ఇవ్వటమే కాకుండా, తనే స్క్రీన్ ప్లే కూడా అందించాడు, నిర్మాతల్లో కూడా భాగం అయ్యాడు. ఈ సినిమా అయిదు రోజుల్లో ఎంత కలెక్షన్ల వర్షం కురిపించిందో అందరికీ తెలిసిందే.

లెక్కల మాష్టారుగా అతని శిష్యులకు పరిచయం అయిన సుకుమార్ అతడిని ఒక్కడినే కాదు చాలామందిని ఇలా దర్శకులుగా పరిచయం చేస్తూనే వున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన నాని నటించిన ‘దసరా’ సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ చిత్రానికి దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల కూడా మన లెక్కలు మాష్టారి శిష్యుడే. ఇది శ్రీకాంత్ మొదటి సినిమా దర్శకుడిగా. ఆమధ్య ‘ఉప్పెన’ అనే సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరగదీసింది కదా. ఇందులో లీడ్ పెయిర్ వైష్ణవ తేజ్ , కృతి శెట్టి ఇద్దరూ కొత్తవారే, ఆ ఇద్దరినీ పరిచయం చేసిన దర్శకుడు బుచ్చిబాబు కి కూడా అదే మొదటి సినిమా.

మరి ఈ బుచ్చిబాబు కూడా దర్శకత్వం ఎక్కడ చదివాడు అనుకుంటున్నారు, మన లెక్కల మాష్టరు సుకుమార్ దగ్గరే. ఇంకో సినిమా ’18 పేజెస్’ (18Pages) అని వచ్చింది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ కథానాయకుడు, నాయక లుగా వేశారు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది, మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. ఇది ఇతనికి మొదటి సినిమా కాదు, కానీ ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. ఇతని సినిమా ‘కుమారి ఎఫ్21’ అందరికీ గుర్తుంది కదా, ఆ సినిమాని ఈ సూర్య ప్రతాప్ దర్శకత్వం చేసిందే.

ఆ సినిమాని నిర్మించింది ఆ దర్శకుడి గురువుగారు సుకుమార్. అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వుంటారు. ఒక దర్శకుడు తాను ఎదగడం కాదు, తన దగ్గర పని చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహించినప్పుడే ఆ దర్శకుడి పేరు మారుమోగుతోంది, అతనంటే పరిశ్రమలో ఒక గౌరవ భావం ఏర్పడుతుంది. ఈరోజు ఎంతమంది ఇలా పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంతటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే, ఒక్క సుకుమార్ తప్ప ఇంకెవరూ కనిపించటం లేదనే చెప్పాలి.

సుకుమార్ తన దగ్గర పని చేసే దర్శకులు కొత్త కథతో వచ్చి తాము మొదటి సినిమాకి దర్శకత్వం చేస్తున్నాం అని చెప్పినపుడు, ‘అల్ ది బెస్ట్’ అని చెప్పటమే కాదు, వాళ్ళకి సరి అయిన గైడెన్స్, సూచనలు ఇచ్చి అవసరం అయితే కథలో కూడా తగు సూచనలు చెప్పి, ప్రోత్సహిస్తున్న సుకుమార్ ‘గురువుగారు’ పదానికి నిజమైన నిదర్శనం. ఇలా చాలామంది అతని శిష్యులు మరిన్ని మంచి సినిమాలతో విజయాలు సాధించి గురువు పేరు నిలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus