ఇండస్ట్రీకి అన్నిటికంటే ఎక్కువగా బాధపెడుతున్న సమస్య ఏంటంటే.. క్యాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీ బంద్, రెమ్యూనరేషన్ ఇష్యూస్ అని చెబుతుంటారు కానీ.. వాటన్నిటికంటే పెద్ద సమస్య ‘పైరసీ’. సినిమా విడుదలైన 24 గంటల లోపే ఆన్లైన్ లో దర్శనమిస్తోంది. పెరుగుతున్న టికెట్ ధరలు, ఇంటర్వెల్ టైమ్ లో మల్టీప్లెక్స్ థియేటర్ల దోపిడీలు భరించలేక సాధారణ ప్రేక్షకులు కూడా పైరసీకే మొగ్గుచూపుతున్నారు. అందువల్ల సినిమాకి లాంగ్ రన్ అనేది ఉండడం లేదు. ఆ కారణంగా ఇంతకుమునుపు తమ సినిమా 50 లేదా 100 రోజులు ఆడినందుకు సంతోషపడిన హీరోలు, దర్శకనిర్మాతలు మొదటివారం షేర్, గ్రాస్ చూసుకొని మురిసిపోతున్నారు. ఇదంతా పైరసీ వల్లే. అయితే.. ఈ పైరసీ గురించి ఎంతమంది, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దాన్ని ఆపలేకపోవడం సరికదా.. కనీసం తగ్గించలేకపోయారు.
గత శుక్రవారం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకువెళుతున్న “రంగస్థలం” సినిమాకి కూడా ఈ పైరసీ బాధ తప్పలేదు. ఏకంగా క్లీన్ హెచ్.డి రిప్ వెర్షన్ ఆన్ లైన్ లభ్యమవుతోంది. ఈ విషయమై “రంగస్థలం” సినిమాలో కీలకపాత్ర పోషించిన అజయ్ ఘోష్ ఫైర్ అయ్యాడు. డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి. అందుకోసం పైరసీని ఎన్నుకోకండి. చిత్రపరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి, దయచేసి వారి జీవనోపాదీని నాశనం చేయకండి అని వేడుకొన్నాడు అజయ్ ఘోష్. మరి అజయ్ ఘోష్ ఘోష వినైనా ఈ పైరసీదారులు కాస్త తగ్గుతారేమో చూడాలి.