మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. రామ్ చరణ్ 16వ సినిమాగా ప్రారంభమైన ఈ సినిమా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో ఓ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది.’దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.
ముఖ్యంగా చివర్లో వచ్చే క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. అలాగే చరణ్ తో పాటు ఈ సినిమాలో తల్లి పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ పాత్ర కోసం దర్శకుడు బుచ్చిబాబు చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. చాలా మందికి లుక్ టెస్ట్ చేసి ఫైనల్ గా ఒక సీనియర్ నటిని ఫైనల్ చేశాడట.
ఆమె మరెవరో కాదు… ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ తల్లిగా చేసిన విజి చంద్రశేఖర్. అవును ఆమెనే ‘పెద్ది’ లో చరణ్ కి తల్లిగా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. విజి చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఈమె సీనియర్ హీరోయిన్ సరితకు స్వయానా సోదరి. రజనీకాంత్ హీరోగా కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘తిల్లు ముల్లు’ అనే సినిమాతో ఈమె కెరీర్ ప్రారంభించింది.
అటు తర్వాత తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన ఎన్నో పెద్ద సినిమాల్లో నటించింది. ఈమె సొంత ఊరు విజయవాడ. అయితే తమిళనాడులో పెరిగింది. ‘అఖండ’ తో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్లో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలపై సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ కూడా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.