Akhanda Review: అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం “అఖండ”. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం టీజర్ నుంచి మొన్న విడుదలైన “జై బాలయ్య” సాంగ్ ప్రోమో వరకూ అన్నీ అభిమానులకు మంచి హై ఇచ్చాయి. చాన్నాళ్ల తర్వాత బెనిఫిట్ షోలు పడిన సినిమా కూడా ఇదే. మరి “అఖండ”గా బాలయ్య అభిమానులకు ఏరేంజ్ హై ఇచ్చాడో చూద్దాం..!!

కథ: మురళీకృష్ణ (బాలకృష్ణ) ఓ ఊరికి పెద్ద. ఊరి వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే ఊరికి కలెక్టర్ గా వస్తుంది శరణ్య (ప్రగ్యా జైస్వాల్). ఒకానొక సందర్భంలో అదే ఊర్లో ఉండే వరదరాజులు (శ్రీకాంత్) చేస్తున్న ఇల్లీగల్ మైనింగ్ వల్ల చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనే తరుణంలో ఎన్.ఐ.ఏ మురళీకృష్ణను జైలుకు పంపిస్తుంది. అదే తరుణమని వరదరాజులు ఊరిని వల్లకాడు చేయడానికి సన్నద్ధమైన తరుణంలో ఎంట్రీ ఇస్తాడు అఘోర అఖండ (బాలకృష్ణ). అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ & అఖండ ఒకేలా ఎందుకు ఉన్నారు? అనేది “అఖండ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: బోయపాటి సినిమా అనగానే బాలయ్యకి పూనకం వస్తుందో లేక బాలయ్య బెస్ట్ ను బోయపాటి మాత్రమే రాబట్టగలడో తెలియదు కానీ.. ఈ సినిమాలో మరోసారి ఊరమాసు పాత్రలో బాలయ్య అదరగొట్టేసాడు. మురళీకృష్ణ పాత్రలోనే మాస్ ఫైట్స్ తో ఇరగ్గొట్టేసాడంటే.. అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో రఫ్ ఆడించేసాడు. బేస్ వాయిస్ లో బాలయ్య డైలాగ్స్ కి థియేటర్లు ఊగిపోవాల్సిందే. బాలయ్యను ఇంత ఫిరోషియస్ గా ఎప్పుడూ చూడలేదు. సో అభిమానులకు ఆయన క్యారెక్టర్ & మోడ్యులేషన్స్ పండగే.

విలన్ గా శ్రీకాంత్ క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ ను బోయపాటి ఇచ్చిన ఎలివేషన్ కూడా అదిరింది. అయితే.. ఆ పాత్రను ముగించిన విధానం మాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రగ్య జైస్వాల్ పాత్ర చాలా చిన్నది.. గట్టిగా రెండు పాటల్లో ఆమె క్యారెక్టర్ మొదలై.. ఎండ్ కూడా అయిపోతుంది. మిగతా నటీనటులు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: “భద్ర” తర్వాత బోయపాటి కాస్త బలమైన కథ రాసుకున్న సినిమా “అఖండ”. హీరో వెర్సెస్ విలన్ అనే రొటీన్ ఫార్మాట్ నుంచి బయటపడి.. మైథలాజికల్ ఫార్మాట్ లో రాసుకున్న కథనం బాగుంది. దుష్ట శక్తిని అంతం చేయడం కోసం దేవుడు దిగి రావడం అనేది మూల కథగా సినిమాను నడిపించిన విధానం ప్రసంశనీయం. సెకండాఫ్ తొలి 20 నిమిషాల వరకూ బాగానే వెళ్లిన సినిమా, అక్కడి నుంచి మాత్రం బాగా సాగింది.

హీరో వందల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. కథ-కథనం గాలికొదిలేశారు బోయపాటి. సెకండాఫ్ లో లాజిక్స్ ఆలోచించి, కాస్త వయొలెన్స్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అవేమీ లేకపోవడంతో ఫ్యాన్స్ మూవీ గా మిగిలిపోయింది. బోయపాటి తర్వాత ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చింది తమన్. బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాలయ్య ఎమోషన్ ను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది.

మంచి డాల్బీ థియేటర్లో సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ ఎక్స్ లెంట్ గా ఉంది. లెజెండ్ తర్వాత బాలయ్యలో ఆ రాజసాన్ని, ఠీవీని అద్భుతంగా చూపించాడు రాంప్రసాద్. కోటగిరి వెంకటేశ్వర్రావు ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కంపొజిషన్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ స్కిల్స్ అలరిస్తాయి.

విశ్లేషణ: లాజిక్స్ మర్చిపోయి బోయపాటి-బాలయ్య క్రేజీ కాంబినేషన్ కోసం, ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం “అఖండ” చిత్రాన్ని థియేటర్లో కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. మాస్ ఆడియన్స్ & బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అయితే.. సాధారణ ప్రేక్షకులకు ఓ మోస్తరుగా నచ్చుతుంది. హిట్ అనిపించుకోవడానికి 52 కోట్లు రాబట్టాల్సి ఉంది, అయితే.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి కారణంగా ఆ నెంబర్ రీచ్ అవ్వగలరా లేదా అనేది ఆలోచించాల్సి ఉంది. కమర్షియల్ గా కష్టమవ్వచ్చు కానీ.. సినిమా పరంగా మాత్రం “అఖండ” సూపర్ హిట్ అనే చెప్పాలి.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus