‘రామాయణ’ సినిమా మొదటి భాగం ట్రైలర్ వచ్చినప్పటి దగ్గరి నుండి వినిపిస్తున్న అతి పెద్ద విమర్శలు మూడు. ఒకటి రాముడి పాత్ర కంటే రావణుడి పాత్రనే ఎక్కువగా ఎలివేట్ చేశారు అని. రెండోది సీత పాత్ర కంటే శూర్పణక పాత్రను హైలైట్ చేస్తున్నారు అని. ఇక మూడోది కాస్ట్యూమ్స్ విషయంలో టీవీ సీరియల్స్‌ను ఫాలో అయినట్లున్నారు అని. మొదటి రెండు విషయాలను సినిమా టీమ్ ఏం క్లారిటీ ఇస్తుందో తెలియదు కానీ.. మూడో కామెంట్‌కి మాత్రం చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, శూర్పణకగా రకుల్ ప్రీత్ నటించిన సినిమా ‘రామాయణ’. ఏంటీ ప్రధాన పాత్రల లిస్ట్‌లో శూర్పణక పాత్ర కూడా ఉండాలా అనుకుంటున్నారా. మామూలుగా అయితే లేదు. కానీ సినిమా టీమే పోస్టర్ల మీద ఆమె ఫొటో వేస్తోంది. కాబట్టి అలా రాయాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే.. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ జులై 30న వచ్చింది. అప్పటి నుండి కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సాయి పల్లవి (సీత), లారా దత్తా (కైకేయి) లుక్స్‌పై విమర్శలు వచ్చాయి. అప్పటి వారికి ఇప్పటి తరం దుస్తులా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే టీవీ సీరియల్స్‌తో పోల్చి మీమ్స్ పెట్టారు. ఈ విమర్శలపై ‘రామాయణ’ కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ స్పందించారు. ఇలాంటి విమర్శలు, పోలికలు వస్తాయని మాకు తెలుసు. రామాయణం లాంటి ఇతిహాసాన్ని తరతరాలుగా చూస్తున్నాం. కాస్టింగ్, కాస్ట్యూమ్స్‌పై ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటాయి. అవి అంగీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు.
ఆ కాలం నాటి వస్త్రాలు మన దగ్గర లేవు. క్యాలెండర్ ఆర్ట్, శిల్ప కళ, ఆధ్యాత్మిక భావన ఉండే బొమ్మలు, రాజా రవి వర్మ చారిత్రక చిత్రాలు చూసి పెరిగాం. రామాయణాన్ని కొత్త తరానికి విజువల్‌గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. అందుకే ఇప్పటి తరానికి నప్పేలా కాస్ట్యూమ్స్ అప్‌డేట్ చేశాం. కైకేయి కాస్ట్యూమ్‌లోని ఆకుపచ్చ రంగు మాతృత్వాన్ని సూచిస్తుంది. ముదురు ఎరుపు రంగు ఆమె తీసుకునే నిర్ణయాల్లోని చీకటిని చూపిస్తుంది. ఒక్కో రంగు వెనుక ఆలోచన, అర్థం ఉన్నాయి. ప్రతిది ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నాం అని చెప్పారు.
ఈ విషయాలేవీ అర్థం చేసుకోకుండానే ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు. సినిమా చూడకుండానే నిర్ణయాలు తీసుకోవద్దు. సినిమా చూసాకే మీ అభిప్రాయాలు చెప్పండి అని రింపుల్, హర్‌ప్రీత్ అన్నారు.