బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ని విమర్శిస్తూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా పోస్ట్ లు కనిపించాయి. అయితే ఆ విమర్శలు తనకు ప్రేరణనిస్తున్నాయని చెప్పుకొచ్చింది అలియా. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా.. హిట్టు సినిమాలతో తన ఫాలోయింగ్ పెంచుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా బట్టల వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. ఓ పక్క నటిగా, మరోపక్క వ్యాపారవేత్తగా బిజీగా గడుపుతోంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తనపై వస్తోన్న విమర్శలపై స్పందించింది. ఇటీవల కాలంలో నెటిజన్లు తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని.. ప్రతిరోజు సోషల్ మీడియాలో దారుణమైన పోస్ట్ లు పెడుతూ తిడుతున్నారని అన్నారు. సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నెటిజన్లు.. తనను కూడా వదలలేదని అన్నారు. తనకు హాని తలపెడతామని బెదిరిస్తూ కొందరు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్న విషయాన్ని తెలిపారు.
అయితే వాటి ప్రభావం తనపై ఎంతమాత్రం పడలేదని అంటోంది. ఇంకా చెప్పాలంటే ప్రతీ పోస్ట్ తనకు ప్రేరణగా నిలిచిందని అన్నారు. తను ఎదుర్కొంటున్న అనుభవాలు ఎన్నో విషయాలను నేర్పిస్తున్నాయని.. ఎదుటవ్యక్తి తో దయతో వ్యవహరించాలనే విషయాన్ని గ్రహించానని చెప్పుకొచ్చారు. సుశాంత్ మరణం అనంతరం నెటిజన్లు స్టార్ కిడ్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలియాభట్ ని కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆర్ఆర్ఆర్’ లో నటించడానికి సిద్ధమవుతోంది.