ఓ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే కేవలం 41 రోజుల్లో ఓ సినిమా పూర్తవ్వడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. చిన్న సినిమా అయినా సరే, చిన్న హీరో సినిమా అయినా సరే అనుకున్న సమయానికి అవ్వడం లేదు అని వార్తలొస్తున్న రోజులివి. అలాంటిది 41 రోజుల్లోనే సినిమా అంటే పెద్ద విషయమే. ఇది ఎలా సాధ్యమైంది అనే విషయాన్ని అల్లరి నరేశ్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఎందుకంటే పూర్తయింది ఆయన సినిమానే కాబట్టి.
‘12ఎ రైల్వే కాలనీ’ అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశారు అల్లరి నరేశ్. నాని కాసరగడ్డ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అదరగొట్టిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కాబట్టి ఈ సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది అనేది మీరే ఊహించుకోవచ్చు. ఈ సినిమాను నవంబరు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో టీమ్ మీడియా ముందుకొచ్చింది. అప్పుడే ఈ 41 రోజుల సంగతి తెలిసింది.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒక ఇంట్లో చేశారట. ఒక గదిలో ఒక సీన్ తీస్తుంటే, మరో గదిలో నెక్స్ట్ సీన్ కోసం రెడీ చేసేవారట. నటులు డ్రెస్ మార్చుకుని ఆ రూమ్‌లోకి వెళ్లి సీన్ చేసేవారట. అలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేశారట. కొన్నిసార్లు 24 గంటలు ఆ ఇంట్లోనే ఉండి షూట్ చేసిన సందర్బాలూ ఉన్నాయట. అలా తక్కువ సమయంలోనే సినిమా పూర్తి చేశారట. అన్నట్లు ఈ సినిమాలో ఎవరు విలన్ అనేది చివరి వరకూ ప్రేక్షకులకు కనిపెట్టలేరట. అల్లరి నరేశ్ విజయం అత్యవసరం అయినప్పుడు ఈ సినిమా వస్తుండటం గమనార్హం. చూడాలి మరి జోనర్ ఛేంజ్ ఏమన్నా మార్పు తీసుకొస్తుందేమో.