‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన అల్లు కుటుంబం ఆ తర్వాత వదిలేసింది అంటూ ఓ విమర్శ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ కుటుంబ బాధ్యతు తీసుకున్న దగ్గరి నుండి వారి బాగోగులు అల్లు కుటుంబం చూసుకుంటోంది అని సన్నిహితులు చెబుతూనే ఉంటారు. తాజాగా ఇది నిజం అని నిరూపించేలా ఓ ఘటన జరిగింది.
శ్రీతేజ్, అతడి కుటుంబాన్ని ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహ పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీకు అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. అల్లు అరవింద్ తిరిగి వెళ్లిపోయేటప్పుడు శ్రీతేజ్ సోదరిని ముద్దు చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో ఆమెకు ఓ హామీ కూడా ఇచ్చారు. ఆమె చదువు సంగతి తాను చూసుకుంటానని అల్లు అరవింద్ చెప్పడం గమనార్హం. దీంతో మరోసారి తమ భరోసా కుటుంబంపై ఎలా ఉంటుందో చెప్పినట్లు అయింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. ఈ సినిమా డిసెంబరు 5, 2024న విడుదలవుతున్న సందర్భంగా ముందు రోజు అంటే డిసెంబరు 4న రాత్రి సెకండ్ షో టైమ్‌లో ప్రీమియర్ షో వేశారు. ఆ సందర్భంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలసి సంధ్య థియేటర్‌కు సినిమా చూడటానికి వచ్చారు. అదే థియేటర్‌కు శ్రీతేజ్ కుటుంబం కూడా సినిమా చూడటానికి వెళ్లింది. అక్కడ తోపులాట, తొక్కిసలాట జరిగి శ్రీతేజ్ తల్లి రేవతి మరణించారు. శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతుగా అల్లు అర్జున్ రూ.2 కోట్లు డిపాజిట్ చేసినట్లు ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు గతేడాది తెలిపారు.