‘లాల్ సింగ్ చడ్డా’… ఆమిర్ ఖాన్ ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమతో, ఎన్నో అంచనాలతో చేసిన సినిమా. ఆ సినిమాలో ఆయన చాలా మందిని భాగం చేసుకున్నారు కూడా. తెలుగు నుండి నాగచైతన్యను తీసుకెళ్లి ఓ పాత్ర చేయించారు. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాకు సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. చిరు ఇటీవల కాలంలో సమర్పకుడిగా వ్యవహరించిన సినిమా ఇదే. అంతటి ఆశలు, హంగులతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఆమిర్ ఇటీవల ఓపెన్ అయ్యారు.
‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా రూ.200 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా కంటే ముందు పెద్దగా పరాజయాలు చూడని ఆమిర్.. ఆ సినిమా, ఆ తర్వాత వచ్చిన సినిమాలతో బాగా దెబ్బతిన్నారు. అందులో ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకటి. నేను ప్రొడ్యూస్ చేసే సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అలవాటు. కథకు అవసరమైన దాన్నే ఎంపిక చేసుకుంటాను. కానీ ‘లాల్ సింగ్ చడ్డా’ విషయంలో ఆ గీత దాటాను. బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున నష్టాలు మిగిల్చింది అని చెప్పారు.
‘దంగల్’ సినిమాకు మన దేశంలో రూ.385 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఆ లెక్కన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకు గరిష్ఠంగా రూ.200 కోట్లు వస్తాయని అనుకున్నాను. సినిమా ఫుల్ రన్ పూర్తయ్యేనాటికి రూ.200 కోట్ల నష్టాన్ని మిగిల్చింది అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమిర్ ఓ నిర్మాణ పాఠాన్ని చెప్పుకొచ్చారు. రూ.120 కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకునే సినిమాకు రూ.80 కోట్లకు మించకుండా బడ్జెట్ పెట్టొచ్చు. రూ.60 కోట్లు అయితే ఇంకా మంచిది అని చెప్పారు.
కరోనా – లాక్‌డౌన్ సమయంలో మన దేశంలో షూటింగ్‌లకు కొన్ని ఆంక్షలు ఉండటంతో విదేశాల్లో షూటింగ్ చేద్దామని అనుకున్నాం. బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం ప్రయాణాల మీద ఖర్చు అయింది. చైనాలో టేబుల్ టెన్నిస్‌పై ఒక సీక్వెన్స్ తీశాం. ఫైనల్ ఎడిట్‌లో ఆ సీక్వెన్స్ తీసేశాం. దీంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.