‘మహాభారతం’ సినిమా కోసం ఇండియన్ సినిమాలో ఓ ముగ్గురు చాలా ఏళ్లుగా ఆలోచిస్తున్నారని.. అందరూ కలిస్తే ఆ సినిమా ఇంకా బాగా వచ్చే అవకాశం ఉందని మొన్నీమధ్య మనం మాట్లాడుకున్నాం. అందులో ఓ వ్యక్తి మరోసారి తన కలల ప్రాజెక్ట్ గురించి మరోసారి స్పందించారు. ఆ ప్రాజెక్ట్ గురించి తాను 30 ఏళ్ల నుంచి కలలు కంటున్నట్లు తెలిపారు. ఆయనే ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
మహాభారత ఇతిహాసానికి జీవం పోయడానికి మూడు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నా అంటూ.. ఆయన ఈ సినిమా విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నాడో చెప్పేశాడు. ఈ ప్రాజెక్ట్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైనది కూడా తేల్చేశాడు. అంటే ఇతరుల ముందుకు రాకపోయినా ‘మహాభారతం’ ముందుకెళ్తుంది అని చెప్పకనే చెప్పారాయన. ఈ సినిమాల కోసం రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలుకానున్నాయి. దీనిని ఒక సినిమాగా కాకుండా యజ్ఞంలా పూర్తి చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆమిర్.
అందరూ మెచ్చేలా ‘మహాభారతం’ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ఇతిహాసాన్ని ఒక్క భాగంలో చూపించలేమని.. అందుకే సిరీస్‌లుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు గతంలోనే ఆమిర్ చెప్పాడు. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు దీని కోసం వర్క్ చేస్తారని.. స్టోరీ రాయడం పూర్తైన తర్వాత నటీనటులను ఎంపిక ఉంటుందని చెప్పారు.
పైన చెప్పినట్లు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కాస్త ముందంజలో ఉన్నారట. అర్జునుడి దృష్టి కోణంలో సినిమాను తెరకెక్కించాలని ఆయన ఆలోచన అని సమాచారం. ఆ పాత్రలో తన తనయుడు అల్లు అర్జునే చేస్తారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా ఈ విషయంలో అల్లు అరవింద్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేయిస్తుండగా.. అందులో కీలక ముందుడగు పడింది అని సమాచారం. అయితే ఈ సినిమాను హ్యాండిల్ చేసేది ఎవరు అనేది మాత్రం తేలడం లేదట.
మరోవైపు రాజమౌళి కూడా చాలా ఏళ్లుగా ‘మహా భారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఆ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాస్తారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆమిర్ ఖాన్ అయితే త్వరలో ఈ పనులు మొదలుపెడతా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ కలిస్తే ఈ కలల ప్రాజెక్ట్ త్వరగా సెట్ అవుతుంది అనే ఓ వాదన ఇప్పుడు వినిపిస్తోంది.