స్టూడెంట్ నంబర్ వన్ నుంచి బాహుబలి వరకు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలకు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను అందించారు. వాటికి రాజమౌళి కొంత మార్పులు చేసినప్పటికీ మూల కథ మాత్రం విజయేంద్ర ప్రసాద్ ఆలోచన నుంచి వచ్చిందే. అందుకే రాజమౌళి కి కథ వినిపించాలని ఎవరూ అనుకోరు. ఆయన వేరేవారి నుంచి కథ తీసుకుంటారని కూడా ఊహించరు. కానీ ఎవరూ ఊహించనిదే ఈసారి జరిగింది. తొలిసారిగా తండ్రి రాసిన కథ కాకుండా బయట్నుంచి జక్కన్న కథ తీసుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాహుబలి తర్వాత రామ్ చరణ్, రామారావు లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
1980 ఒలంపిక్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది. పైగా క్రీడా నేపథ్యంలో సాగుతుంది. అందులో ఎన్టీఆర్ బాక్సర్ గా, రామ్ చరణ్ హార్స్ రైడర్ గా కనిపించనున్నారు. ఈ కథని నిర్మాత గుణ్ణం గంగరాజు రాసుకున్నారంట. అమృతం సీరియల్, లిటిల్ సోల్జర్స్ , ఐతే వంటి సినిమాల ద్వారా అందరికీ తెలిసిన ఈయన ఎప్పుడో ఒక లైన్ అనుకున్నారు. దానిని రాజమౌళికి చెప్పగా నచ్చి తీసుకున్నారు. ఆ కథని విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి అండ్ కో స్క్రిప్ట్ గా మలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.