లోకేశ్ కనగరాజ్ – అనిరుథ్ కలిస్తే.. వెండితెరపై ఓ మ్యాజిక్ జరుగుతుంది. సినిమా ఫలితం బాగోలేకపోయినా అనిరుథ్ పనితనం మీద ఎప్పుడూ విమర్శలు రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలుస్తున్నారు. ఈసారి వీరు కలిసేది అల్లు అర్జున్‌తో అనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమాను అనౌన్స్ చేసిన సమయంలోనే ఓ స్పెషల్ బిట్ సాంగ్‌ని చేసి మరీ అనిరుథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు అని చెప్పేశారు. దీంతో అని మ్యూజిక్‌లో బన్నీ స్టెప్పులు చూసే అవకాశం ఇన్నేళ్ల వెయిటింగ్ తర్వాత ఫ్యాన్స్‌కి దక్కింది.
AA23 అనే పేరు చలామణిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘రాకా’ సినిమా తర్వాత బన్నీ ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండానే ఈ సినిమాను స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఈ విషయం మీద నమ్మకం లేకపోయినా.. ప్రస్తుతానికి నమ్మాల్సిందే. అలా మరో నమ్మలేని విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అదే బన్నీ సినిమా కోసం అనిరుథ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్. ఇండియన్ సినిమాలో ఏ సంగీత దర్శకుడూ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని టాక్.
అవును.. ‘ఏఏ 23’ సినిమా కోసం అనిరుథ్‌కి మైత్రీ మూవీ మేకర్స్ రూ.20 కోట్లకుపైగా ఇస్తోందని కోడంబాక్కం వర్గాల సమాచారం. సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుందని.. అనిరుథ్‌కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని సినిమా బృందం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి. ఇందులో ఎలాగూ అధికారిక కన్ఫర్మేషన్లు రావు కాబట్టి ఈ వార్తను సంబంధిత వ్యక్తులు కొట్టేయకపోతే నిజమే అనుకోవచ్చు.
‘రాకా’ సినిమా విషయానికొస్తే.. గత కొన్ని నెలలుగా అప్‌డేట్‌లు లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారు అట్లీ. త్వరలో అప్‌డేట్ ఇస్తే సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తుంది. అలాగే లోకేశ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.