స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారో.. అప్పటినుండి సినిమాలో చాలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. సినిమా సబ్జెక్ట్ చాలా పెద్దది కావడం వలన ఇలా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు రెండో భాగం కోసం కొన్ని సన్నివేశాలు రాసుకుంటున్నారు.
ఇందులో ఎలాగో పాటలు, ఫైట్లు పెడతారు. అయితే ఇప్పటివరకు అనుకున్న రష్మిక కాకుండా రెండో భాగంలో మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం కూలీ ఓ మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత రెండో భాగం మొదలవుతుందని.. తొలి భాగం రగ్డ్ గా ఉంటే రెండో భాగం చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం ఆ రేంజ్ హీరోయిన్ కు సూటయ్యే పాత్రను డిజైన్ చేస్తున్నారట.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంలో క్లారిటీ రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని నిర్మాత చెప్పినప్పటి నుండి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ న్యూస్ కూడా హైలైట్ అవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి!